స్త్రీ విద్య ప్రాధాన్యత కొరకు పోరాడిన జ్యోతిబాపూలే

Published: Tuesday April 12, 2022
బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్
వికారాబాద్ బ్యూరో 11 ఏప్రిల్ ప్రజాపాలన :  బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్య కోసం పాటుపడిన జ్యోతిబా పూలే అందరికి ఆదర్శప్రాయుడని, అయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. సోమవారం మహాత్మా జ్యోతిబా పూలే 196వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక డి పి ఆర్ సి భవనములో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని అయన మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా  సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిబా పూలే అని, ఆయన దేశానికి ఎన్నో సేవలు అందించారని, వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని తెలిపారు. కుల, లింగ వివక్షకు తావు లేకుండ విద్య, సమానత్వం ద్వారానే సామాజిక, ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయనే మహాత్మాపూలే ఆలోచన విధానాన్ని అందరు స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఆయన సహచరి సావిత్రి బాయి పూలేకు గురువుగా మారి ఉన్నత విద్యా వంతురాలిగా తీర్చిదిద్ది, ఎంతో మంది మహిళలకు  సావిత్రి బాయిచే విద్య నేర్పించారని,  చరిత్రలో  సావిత్రి  బాయి  మొట్టమొదటి  మహిళా  ఉపాద్యాయురాలిగా  నిలిచి పోయారని తెలిపారు. విద్య కొసం మొట్టమొదటి పాఠశాల నెలకొల్పి తన భార్యకు ఉపాధ్యాయురాలిగా నియమించారన్నారు. ఆతరువాత ఎన్నో పాఠశాలలు నెలకొల్పినారని తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పునరంకితం కావలసిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూలే ఆశయ సాధనకు వెనుకబడిన తరగతుల విద్యార్థుల కొసం 240 గురుకులాలను స్థాపించడం జరిగిందని తెలియజేసినారు. జిల్లాలోని వికారాబాద్ తాండూర్ లలో బీసీ విద్యార్థుల కొసం స్టడీ సర్కిల్స్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్బంగా తెలియజేసినారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ, జ్యోతిబా పూలే మహిళల అభ్యున్నతికి విశేష కృషి చేసారని, బాబు జగజీవన్ రామ్, బిఆర్ అంబేద్కర్ జ్యోతిబా పూలే లాంటి మహనీయుల ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకొని వారిని గుర్తు చేసుకుంటూ, వారు చూపిన బాటలో ముందుకు సాగాలన్నారు. ఆడ పిల్లలు అందరు బాగా చదివి అభివృద్ధి చెందాలని, ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా వివక్ష ఉంటే ధైర్యంగా ముందుకు సాగాలని, అసమానతలు లేని సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. అంతకు ముందు జ్యోతిబా పూలే చిత్రపటానికి బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జిల్లా కలెక్టర్ తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, ఎంపీపీ చంద్రకళ, సంగీతపు రాజలింగం, బీసీ సంగం అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్, పెండ్యాల అనంతయ్య, తిమ్మని శంకర్, భూమనోళ్ళ కృష్ణ, బీసీ సంగం సభ్యులతో పాటు బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, యస్సి సంక్షేమ శాఖ అధికారి మల్లేశం, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, వికారాబాద్ ఎంపీడీఓ సత్తయ్య, హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.