ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన -----మంత్రి శ్రీనివాస్ గౌడ్

Published: Friday October 28, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు లింగోజిగూడెంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కొని ఉప ఎన్నిక తీసుకురాగా ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బిజెపి నాయకులు తెర తీశారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు లింగోజిగూడెంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసిన బిజెపి నేతల తీరును నిరసిస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నల్ల చొక్కా ధరించి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పుడు చంద్రబాబు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని రేవంత్ రెడ్డి ద్వారా కుట్రలు చేసి బట్టబయలు అయ్యి ఓటుకు నోటు దొంగగా ఇక్కడి నుంచి పరారు అయ్యారని, ఇప్పుడు బీజేపి నేతలు, మోదీ సైతం అచ్చం చంద్రబాబు లాగే దుర్మారంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారన్నారు. ఒక్కో ఎమ్మెల్యే కు రూ. 100 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాలని చేసిన కుట్ర బట్టబయలు అవడంతో బిజెపి నీచ రాజకీయం తేటతెల్లం అయ్యిందని తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని బిజెపి కొనుగోలు చేసినట్లు మా ఎమ్మెల్యేలను ఎవరు కొనలేరని మంత్రి పేర్కొన్నారు. ఆదాని, అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ముతో ఇలా ఎమ్మెల్యేలను కొనే కుట్రలు చేస్తున్నారని కేంద్రంలోని బిజెపి సర్కారు తీరు పట్ల తీవ్రంగా స్పందించారు. దేశంలో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కేందుకు బిజెపి ఇలాంటి కుట్రలు చేస్తోందని... సీఎం కెసిఆర్ ముందు బిజెపి కుప్పిగంతులు సాగవని అన్నారు.
దేవుళ్ల పేరిట యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా... బిజెపి నేతల బండారం బట్టబయలు అయ్యి యువకులు ఆ పార్టీకి దూరం అవుతున్నారని తెలియజేశారు. గొర్రెల పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన సొమ్మును ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి బిజెపి నాయకులు ఆపించారని... యాదవులకు మంజూరైన నిధులు వారి ఖాతాలోంచి తీసే అధికారం ఎవరికి లేదన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వారు గొర్రెలు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 70లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న సర్కారు తమదని ఆసరా పింఛన్లతో వృద్ధుల్లో భరోసా లభించిందన్నారు. తెలంగాణ వచ్చాక కరువు అనేదే లేదని అన్నం పెట్టే ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని మంత్రి కోరారు. మహబూబ్ నగర్ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మంత్రి వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొన్న మంత్రికి లింగోజిగూడెం మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులు ఇచ్చి స్వాగతం పలికారు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.,