అధికారుల నిర్లక్ష్యం... గీత కార్మికులకు శాపం...

Published: Wednesday July 14, 2021
ఈత మొక్కల పంపిణీలో తీవ్ర జాప్యం
చెరువులు, కుంట కట్టల పైన కానరాని ఈత మొక్కలు
మెట్ పల్లి, జూలై 13 (ప్రజాపాలన ప్రతినిధి): పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా గీత కార్మికులకు ఉపాధి పెంచడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈత మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించగా స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగా గీత కార్మికులకు శాపంగా మారింది. నానాటికి ఈతవనం తగ్గి ఉపాధి కోల్పోయి గౌడన్న భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో వారికి ఉపాధిని మరింత పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈతమొక్కల పంపిణీకై ఆదేశాలు జారీచేసింది. మిషన్ కాకతీయ పనులలో భాగంగా చెరువులు, కుంట కట్టలను వెడల్పు చేసినప్పుడు వాటి కట్టలపైన ఇరువైపుల హరితహారంలో భాగంగా ఈత చెట్లను నాటాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మెట్ పల్లి డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లోని చెరువులు, కుంటల కట్టలపైన అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈత మొక్కలు కనబడిన దాఖలాలు లేవు. గత హరితహారం సమయంలో ఈతముక్కలను పంపిణీ చేసిన నర్సరీలలో మొక్కల పెంపకాలపై తగిన శ్రద్ధ తీసుకోలేదని తెలుస్తోంది. కాగా పంపిణీ చేసిన మొక్కలు ఒకటి లేదా రెండు ఆకులు ఉన్న మొక్కలను పంపిణీ చేయడం వలన వాటి పెంపకం గౌడన్నకు తలనొప్పిగా మారుతోంది. అయితే గత సంవత్సరం మాదిరిగా ప్రస్తుత హరితహారంలో ఒక ఈత మొక్క కూడా పంపిణీ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. అధికారులు చొరవ చూపించని ఎడల రానున్న రోజుల్లో కట్టలపైన ఈతముక్కల నాటకపోతే గీత కార్మికుల జీవితం మరింత ప్రశ్నార్థకం కానుంది. కట్టలపై కానరాని ఈత చెట్లు సీఎం కేసీఆర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈత మొక్కల పెంపకం సక్రమంగా జరగడం లేదు. ఇప్పటివరకు మొక్కలు నాటడంలో అధికారులు విఫలమయ్యారు. కొన్ని చోట్ల మొక్కలు నాటిన వాటి సంరక్షణ గాలికి వదిలేయడం వలన ఫలితం లేకుండా పోతోంది.
నర్సరీలలో మొక్కల పెంపకం పై నిర్లక్ష్యం నాణ్యమైన ఈత మొక్కలను వన నర్సరీల్లో పెంపకంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ సమయంలో మొక్కలు రెండు ఆకులు లేదా మూడు కంటే ఎక్కువ పెరుగుదల లేకపోవడంతో వాటిని  పెంచడంలో గౌడన్నలకు తల నొప్పిగా మారుతుంది. కొంత ఎదిగిన చెట్లను పంపిణీ చేస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు. భూములు చదును చేస్తూ చెట్లను తొలగిస్తున్న రైతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతో వ్యవసాయం లాభసాటిగా మారటంతో గత కొన్ని సంవత్సరాలుగా బీడు భూములుగా ఉన్న వాటిని రైతులు చదును చేసి పంటలు పండిస్తున్నారు. ఈ భూమి చదును చేసే క్రమంలో రైతుల భూములలో ఉన్న ఈత చెట్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వారు తొలగిస్తున్నారు. దీంతో చెట్లు తగ్గిపోయి గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. అలాగే అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని చెట్లు దగ్ధమై ఉపాధి ప్రశ్నార్ధకం అవుతుంది. గౌడన్న కు ఏది భరోసా గీత కార్మికుల వృత్తిలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో కార్మికులు వలసబాట పడుతున్నారు. అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొని స్వదేశానికి తిరిగి వచ్చినవారు ఎందరో ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు నాణ్యమైన మొక్కలు పంపిణీ చేయాలని అలాగే ప్రభుత్వ భూములలో ఈత మొక్కలు నాటి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచి తమకు భరోసా కల్పించాలని వారు కోరుకుంటున్నారు.