అన్ని శాఖల్లో అవినీతే . జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయాలి

Published: Wednesday November 02, 2022
ఆసిఫాబాద్ జిల్లా , నవంబర్ 01 , ప్రజాపాలన, ప్రతినిది: 
 
జిల్లాలోని ప్రతి శాఖలో అవినీతి రాజ్యమేలుతుందని విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అధికారులు అవినీతి అక్రమాలకు తెర లేపితే అరికట్టాల్సిన జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోకపోవడం దారుణమని, అంతేకాకుండా వారికే వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, పెద్దవారు తప్పు చేస్తే చిన్న ఉద్యోగులని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంలో మంజూరైన నిధులను స్వాహా చేసిన ఆర్డిఓపై సెలవు పై పంపించారని, ఎమ్మెఎల్ స్ గోదాములో సుమారు రూ 3 కోట్ల బియ్యం గోల్మాల్ జరిగితే కిందిస్థాయి అధికారులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.15 రోజులలో చర్యలు తీసుకోవాల్సి ఉండగా నెల రోజులైనా చర్యలుతీసుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. జిల్లాలోని అన్ని శాఖలో ప్రతి విషయములో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అధికారులకు వత్తాసు పలుకుతున్న జిల్లా కలెక్టర్ ను వెంటనే బదిలీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా శ్యామ్ కుమార్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి తిరుపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.