పల్లెల ప్రగతియే ప్రధాన లక్ష్యం

Published: Saturday October 01, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 30 సెప్టెంబర్ ప్రజా పాలన : పల్లెల ప్రగతి ప్రధాన లక్ష్యమని సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మర్పల్లి మండల పరిధిలోని మల్లికార్జున గిరి గ్రామంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచుతో కలిసి ప్రతి గల్లి గల్లి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ కల్పించిన సువర్ణావకాశంతో  మల్లికార్జునగిరి నూతన గ్రామపంచాయతీగా ఏర్పడిందన్నారు. గ్రామంలో ప్రజల అవసరాలకు అనుగూణంగా మూడు ప్రదేశాల్లో మినీ ట్యాంకులు (సింటెక్స్) లు నిర్మించి, వాటికి నల్లాలు బిగించాలని సంబందిత శాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మంచినీటి పైపు లైన్లు ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా, ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. నెలలో మూడు సార్లు 1, 11, 21వ తేదీలలో మిషన్ భగీరథ త్రాగు నీటి ట్యాంకులను కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు. మిషన్ భగీరథ మంచి నీటిని  ప్రజలందరూ..  త్రాగాలని అందుకు మిషన్ భగీరథ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో అవసరమైనచోట నూతన స్తంభాలు ఏర్పాటు చేసి వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, పంట పొలాల వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలన్నారు. గ్రామంలో నూతనంగా మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. గ్రామంలో ప్రతి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పశువుల డాక్టర్ అందుబాటులో ఉండాలని పశువైద్య అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రామంలోని ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.