ఓట్ల కోసమే యావర్ రోడ్డు విస్తరణ జపం బిజెపి నియోజక వర్గ ఇంచార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి

Published: Thursday December 01, 2022

జగిత్యాల, నవంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల లోని యావర్ రోడ్డు విస్తరణ పనులపై ఎవరికి చిత్తశుద్ధి లేదని కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం చేసే జపంగా మార్చేశారని బిజెపి నియోజక వర్గ ఇంచార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడారు. జగిత్యాల మునిసిపాలిటీ 1952 లో ఏర్పాటై శరవేగంగా అభివృద్ధి చెందుతూ గ్రేడ్ 3 మునిసిపల్ నుంచి గ్రేడ్ 1 గా ఎదిగిందన్నారు. అయినా ఏండ్ల నుంచి యావర్ రోడ్డు విస్తరణ కేవలం మాటలకే పరిమితమైందన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అధికారంలోకి వస్తే విస్తరణ చేస్తామని ప్రకటిస్తూ దశాబ్దాలుగా ప్రజలను వంచిస్తూ వస్తున్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటు తదుపరి జిల్లా ల విస్తరణలో జగిత్యాల జిల్లా గా మారిందన్నారు. అదే తరహాలో రోజురోజుకు జగిత్యాల జిల్లా కు వచ్చే వారితో పట్టణ రోడ్లపై ఒత్తిడి పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయన్నారు. అలాగే ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రధానంగా యావర్ రోడ్డు పై ఒత్తిడి పెరుగుతోందన్నారు. 1989 లోని మాస్టర్ ప్లాన్ లోనే యావర్ రోడ్డు విస్తరణపై క్లారిటీ ఉందని, ఆనాటి నుంచి నేటివరకు పాలకులు యావర్ రోడ్డు విస్తరణ పనులను చేపట్టడమే మానేశారన్నారు. యావర్ రోడ్డును వంద ఫీట్ల విస్తరణ తో కేవలం 212 మందికి నష్టం వాటిల్లుతుందని ముదుగంటి రవీందర్ రెడ్డి చెప్పారు. ఇందులో చాలామందికి పాక్షికంగా నష్టం జరుగుతుండగా కేవలం 20 నుంచి 25 మందికి పూర్తిగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. యావర్ రోడ్డులో ముఖ్యమైన సెంటర్లు ఉన్నాయని చెప్పారు. పాలకులు ప్రభుత్వ కార్యాలయాల్లోని గోడలను మాత్రమే వెనక్కు జరిపి యావర్ రోడ్డు విస్తరణను మానేశారన్నారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యావర్ రోడ్డు విస్తరణ చేపడతామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రకటించాడని అలాగే 2017 నవంబర్ నెలలో జగిత్యాలకు వచ్చిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కూడా హామీ ఇచ్చారని ఇప్పటికీ విస్తరణ పనుల జాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ సుందరికరణ పేరిట లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని యావర్ రోడ్డు విస్తరణ ఆవశ్యకతను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముదుగంటి రవీందర్ రెడ్డి కోరారు. ప్రతి చిన్న విషయానికి స్పందించే నేపథ్యం ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇటీవలే బండి సంజయ్ అంశంలో స్పందించారని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కోరుతున్నానని యావర్ రోడ్డు విస్తరణ పనులను ఎన్నికల వాగ్దానంగా మార్చకుండా విస్తరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించాలని మళ్ళీ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయని యావర్ రోడ్డు ను ఎన్నికల వాగ్దానంగా మిగల్చరాదని ముదుగంటి రవీందర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో  బిజెపి నాయకులు ఏ.సి.ఎస్ రాజు.  చీటి చంద్రశేఖర్ రావు,గుర్రం రాము, మాడిశెట్టి మల్లేశం, లక్ష్మారెడ్డి, ఇత్తడి రాజారెడ్డి, మొర్రి విజయ్, గోగికారి మహేందర్, పోరండ్ల బిక్షపతి, బిట్టు. మారుతి. నిఘాబాబు, కూర్మచలం సతీష్, గట్టుపల్లి జ్ఞానేశ్వర్, కాసారపు శ్రీనివాస్, గోపురం సాయి, నాగరాజు, కోల రాజ్ కుమార్, తరాల మహేష్ చుక్క అశోక్, ఎక్కల్ దేవ్ చిన్న మల్లేష్. బొమ్మిశెట్టి ప్రవీణ్, శంకర్, పిట్టల రాకేష్, గాజోజీ సంతోష్, అనిల్ బస నాగేంద్ర  తదితరులు ఉన్నారు.