పోలీసుల‌పై ఆరోప‌ణ‌లు అవాస్త‌వం * తాండూరు రూరల్ సీఐ రాంబాబు

Published: Monday October 10, 2022
వికారాబాద్ బ్యూరో 9 అక్టోబర్ ప్రజా పాలన : చ‌ట్టం ప్ర‌కార‌మే బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన గిరిజన సర్పంచ్‌పై కేసు న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌ని తాండూరు రూర‌ల్ సీఐ రాంబాబు తెలిపారు. బషీరాబాద్ మండలం నంద్యానాయక్ తండాలో మతిస్థితిమితం లేని బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన సర్పంచ్ శంకర్ నాయక్ పై కేసు నమోదు విషయంలో పోలీసులు పక్షపాతం, నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను శనివారం తాండూరు రూరల్ సీఐ రాంబాబు కొట్టి పారేశారు. సర్పంచ్ పై కేసు నమోదు చేసే విషయంలో ఎలాంటి రాజకీయం లేద‌ని స్పష్టంగా పేర్కొన్నారు. బాలికపై సర్పంచ్ అత్యాచారానికి యత్నించినట్లు మాత్రమే బాధితురాలు అన్న రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని వివరించారు. దీని ఆధారంగా సర్పంచ్ శంకర్ నాయక్ పై అత్యాచారయత్నం సెక్షన్ల ప్రకారమే కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. మరోవైపు నిందితుడైన సర్పంచ్ శంకర్ నాయక్ ను కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించడం జరిగిందని తెలిపారు.