స్వార్థ రాజకీయాల కోసం దళితులను విభజించి పాలించవద్దు : చెన్నయ్య

Published: Friday October 01, 2021
హైదరాబాదు 30 సెప్టెంబర్ ప్రజాపాలన : అగ్రవర్గ రాజకీయ పార్టీలారా ఖబడ్ధార్ అంటూ హెచ్చరించిన చెన్నయ్య. మీ స్వార్థ రాజకీయాల కోసం దళితులను విభజించి పాలించవద్దు అని ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య. తెలంగాణ పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు మాజీ పి సి సి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్సి వర్గీకరణ సాధిస్తాం మరియు అలాంటి వారికి అండగా ఉంటాం అంటూ వ్యాఖ్యలు చేయడం కోర్ట్ ధిక్కరణ కిందికి వస్తుందన్నారు చెన్నయ్య. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. ముఖ్యంగా అగ్రవర్గ రాజకీయ పార్టీలు వర్గీకరణ పేరుతో దళితుల మధ్య అనేక రకాలుగా చిచ్చు పెడుతున్నారన్నారు. అదేవిధంగా దళితులు స్థాపించిన పార్టీలు ఎస్సీల వర్గీకరణకు వ్యతిరేకిస్తుండగా కేవలం అగ్రవర్గ పార్టీలు ఎస్సి వర్గీకరణకు సమర్తించడంలోని లోపాయికారి తనాన్ని అర్థం చేసుకోవాలని చెన్నయ్య దళితులను కోరారు. గతంలో సుప్రీం కోర్ట్ ధర్మాసనం రిజిస్ట్రార్ జనరల్ అఫ్ ఇండియా మరియు జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్లు వర్గీకరణను వ్యతిరేకించాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా ఎస్సి వర్గీకరణ సాధ్యం కాదని, ఇది జాతీయ సమస్య అని పార్లమెంట్ సాక్షిగా తెలిపిన విషయాలు మరిచి పోయారా? అని మీడియా ద్వారా ప్రశ్నించారు. అయినా అగ్రవర్ణ రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అన్నదమ్ముల్లా కలిసి ఉన్న దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావంతోనే ఈ సమస్య సమసిపోయిందన్నారు. ఉష మెహ్రా కమిషన్ సైతం మాదిగలు వారి జనాభా కంటే మించిన ప్రయోజనాలు పొందుతున్నారని తమ నివేదికలో పేర్కొన్నారన్నారు. దళితులు రాజ్యాధికారం చేజిక్కించుకోకుండా అగ్రవర్ణ రాజకీయ పార్టీలు కుట్ర పన్ని దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చెన్నయ్య. రాబోవు ఎన్నికల్లో వర్గీకరణకు వత్తాసు పలికే రాజకీయ పార్టీలను చిత్తుగా ఓడించాలని మాల మరియు ఉపకులాల్ని ఆయన కోరారు. రాష్ట్రంలో దళిత సోదరులు ఎవరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్గీకరణను కోరుకోవడం లేదన్నారు. దళితులందరి ఎజెండా ఒక్కటే రాజ్యాధికారమే లక్ష్యంగా అందరు పనిచేస్తున్నారన్నారు. ఇప్పటివరకు దళితులు ఎదుర్కుంటున్న మౌలిక సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే అని చెన్నయ్య హితవు పలికారు. పెండింగ్ లో ఉన్న రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ ను వెంటనే పునరుద్ధరించాలన్నారు. తదుపరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన దళిత బంధు పతాకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరచాలని చెన్నయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు కావలి రమేష్, యూత్ అధ్యక్షులు జి. రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగి ఆనంద రావు, శేఖర్, గణేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.