చోరీలకు పాల్పడుతున్న భార్య భర్తలు అరెస్ట్

Published: Tuesday November 16, 2021
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 15, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇళ్లల్లో చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న భార్య, భర్తలు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎసిపి అఖిల్ మహాజన్ పూర్తి వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లికి చెందిన తాళ్లపల్లి ప్రసాద్, ధనలక్ష్మి ఏడాది కాలంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. పట్టణంలోని ఇక్బాల్ అహ్మద్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ధనలక్ష్మి గాజులు అమ్ముతూ, ప్రసాద్ బస్ స్టేషన్ లో కూల్ డ్రింక్స్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం ద్వారా వస్తున్న ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించు కున్నారు. ఇందులో భాగంగా ప్రసాద్ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి, రాత్రివేళల్లో ఇద్దరు కలిసి తాళాలు పగలగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసేవారు. ఈ క్రమంలో స్థానిక మార్కెట్ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసులకు అనుమానాస్పదంగా వీరు కనిపించడంతో విచారించగా నేరాలు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుండి రూ.4 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎసిపి వివరించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పట్టణ సిఐ బి.నారాయణ నాయక్, ఎస్సైలు డి.కిరణ్ కుమార్, వి.ప్రవీణ్ కుమార్, ఎన్.దేవయ్య, హెడ్ కానిస్టేబుల్ బి.దివాకర్, కానిస్టేబుల్ శ్రీనివాస్ లను ఎసిపి అభినందించి రివార్డు అందజేశారు.