లాక్ డౌన్లో నష్టపోతున్న పేదలకు నగదు సహాయం అందించి ఆదుకోవాలి : కొలిపాక శ్రీనివాస్

Published: Monday May 31, 2021

బెల్లంపల్లి, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల నిరుపేదలు నష్టపోయి అర్ధాకలితో అలమటిస్తున్నారని వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు సహాయం అందించి ఆదుకోవాలని తెలంగాణ పద్మశాలి సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆదివారం నాడు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ గత 20 రోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల ఎంతోమంది రోజు కూలీలు, ఆటో డ్రైవర్లు, గుమస్తాలు, ముఖ్యంగా హోటల్ రంగం వారు తీవ్రంగా నష్టపోయి అర్ధాకలితో అలమటిస్తున్నారని వారికి రెండు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం, 25 వందల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నగదు సహాయంగా అందించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ప్రభుత్వ సహాయం అందడం లేదని  ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులకు మాత్రం ఎమ్మెల్యే ఎంపీలకు రెండున్నర లక్షల వేతనంతో పాటు రాజభవనం లాంటి క్యాంపు కార్యాలయాలు అనారోగ్యం చేస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సహాయం పొందుతున్నారనీ ఓటర్లు మాత్రం అర్ధాకలితో జీవించడం కలచివేస్తుందని వెంటనే దేశ ప్రధాని నల్లధనాన్ని బయటకు తీసి ప్రజలకు నష్టపోయిన వారికి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు వందల రూపాయలు వారి వారి ఖాతాలో జమ చేసి ఆదుకోవాలని అలాంటప్పుడే ఆర్థిక స్వాతంత్య్రం లభించి దేశం బాగుపడుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు.