ప్రభుత్వం చేపడుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలి * పల్లె ప్రగతి, మనబడి పనులను మార్చి 15 లోప

Published: Saturday March 11, 2023
వికారాబాద్ బ్యూరో 10 మార్చి ప్రజాపాలన :  ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  పనులను ప్రాధాన్యత క్రమంలో  పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో చేపడుతున్న సిసి రోడ్ల నిర్మాణం, మన ఊరు-మన  బడి,  పల్లె పట్టణ ప్రగతి, ఇరిగేషన్ పనుల పురోగతిపై జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఎంపీడీవోలు, ఎంపీలు , ఏపీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్,  టెక్నికల్ అసిస్టెంట్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న  పనులను మన నిర్లక్ష్యం వల్ల చేయకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపతుందని అందులో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు,  వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. గతంలో సూచించిన మేరకు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 10 రకాల వివిధ పనులను చేపట్టాలని ఆదేశించినప్పటికీ కింది స్థాయిలో పని జరగకపోతే ప్రయోజనం ఏంటి అని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎన్నో కార్యక్రమాలను చేయాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు జరగడం లేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.  మార్చి 15 వరకు సూచించిన పనులను పూర్తి చేయాలని తెలిపారు. మార్చి 17 నుండి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు సూచించిన పనులు సక్రమంగా నిర్వహించనట్లయితే సంబంధిత అధికారులపై వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. మన ఊరు మన బడి కింద చేపడుతున్న ఎన్ఆర్ఈజీఎస్ పనులను మార్చి నెలాఖరులకు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే పెయింటింగ్ పనులు పూర్తి అయిన వాటికి మూడు రోజుల్లో అంచనాలను కలెక్టర్ లాగిన్ లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మంజూరైన సి.సి. రోడ్ల పనులకు సంబంధించి మార్చి 15 లోపు ఎప్టీవో  జనరేట్ చేసినట్లయితే  పనులు చేపడుతున్న సర్పంచులు,   విద్యా కమిటీ చైర్మన్లు,  కాంట్రాక్టర్లకు మార్చి 31 లోపు చెల్లింపులు చేసిన వారం అవుతామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 273 సిసి రోడ్లు పనులు పూర్తయ్యాయని, 23 సీసీ రోడ్ల పనులు ఇంకా గ్రౌండింగ్ చేయలేదని వీటికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని కలెక్టర్ అధికారులకు  సూచించారు.  ప్రస్తుతం పురోగతిలో ఉన్న సిసి రోడ్ల పనులను 100 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 
జిల్లాలో మంజూరైన 16 చెక్కు డ్యాములను మే 15 లోపు పూర్తి కావాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు గ్రామాల్లోని సర్పంచులు,   రైతు సమితి,  ఆయకట్టు కింద సాగు చేసే రైతులు,  గ్రామ పెద్దలలో పాటు ఇతర ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి  వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే ఇరిగేషన్ పనులు 80 శాతం కాగా  మిగతా పనులను వారం లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులలో పూడికతీత పనులు,  చెరువుల బలోపేతానికి అదేవిధంగా పొదల తొలగింపుకై  వారంలోపు గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రణాళిక బద్ధంగా పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో ఫెన్సింగ్ లేని ట్రాన్స్ ఫార్మర్లు ఉండకూడదని కలెక్టర్ విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు.  విద్యుత్ ప్రమాదాల వల్ల ఏ ఒక్కరికి ప్రాణహాని జరిగినా క్రిమినల్ కేసులు తప్పవని  కలెక్టర్ హెచ్చరించారు. ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ లేకపోవడం వల్ల మనుషులతో పాటు పశువుల కూడా ప్రాణహాని ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 1734 ట్రాన్స్ ఫార్మర్లకు ఫెన్సింగ్ లేధని,   నెల రోజుల లోపు ప్రతి ట్రాన్స్ ఫార్మర్  కు ఫెన్సింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి గ్రామ పంచాయతీల సహకారం తీసుకొని ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  డిఆర్ఓ అశోక్ కుమార్, డి ఆర్ డి వో కృష్ణన్,  డిపిఓ తరుణ్ కుమార్, డీఈఓ రేణుకా దేవి, వివిధ ఇంజనీరింగ్ శాఖల ఇఇ లు తదితరులు పాల్గొన్నారు.