ప్రారంభించిన నెలరోజులకే పగిలిపోయిన తారురోడ్డు

Published: Monday July 26, 2021
నాణ్యత ప్రమాణాలు పాటించని అధికారులుసిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి
మధిర, జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : మండలం లోని దెందుకూరు నుండి అంబారుపేట మీదుగా మాటూరుపేట వరకూ 8 కోట్ల రూపాయలతో ఆయా గ్రామాల రైతులకు ఉపయోగపడేలా R&B అధికారుల పర్యవేక్షణలో తారు రోడ్డు నిర్మించారు. గత నెల 25 న దానిని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు ప్రారంభించారు. కానీ ప్రారంభించిన నెలరోజుల లోపే రోడ్డు పై అక్కడక్కడ పగుళ్ళు ఏర్పడటం చూస్తుంటే అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుందని బెజవాడ రవి విమర్శించారు. మధిరలో అభివృద్ధి ముసుగులో జరుగుతున్న పనులు కేవలం కొంతమంది కాంట్రాక్టర్లకు ఆర్ధికపరంగా వరంలాగా ప్రజలకు శాపం లాగా మారిందని విమర్శించారు. అలాగే దేశినేనిపాలెం నుండి ఇల్లూరు వరకూ తారు రోడ్ వేశారు ఇదికూడా రైతులకు ఉపయోగపడే రోడ్డు. కానీ దేశినేనిపాలెం ఊరి మొదట్లో నిర్మించాల్సిన కల్వర్టును పూర్తి చేయకపోవడం వలన రైతులకు వ్యవసాయ పనులకు తీవ్ర ఇబ్బంది కల్గుతుందని కావున అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని రైతుల పక్షాన బెజవాడ రవి డిమాండ్ చేశారు. అస్సలు మధిర ప్రాంతంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న పనులను చేసే కాంట్రాక్టర్లు అధికారులు చెప్పినట్లు చేస్తున్నారా లేకపోతే కాంట్రాక్టర్లు చెప్పినట్లు అధికారులు వింటున్నారా అని అధికారులను బెజవాడ రవి సూటిగా ప్రశ్నించారు. త్వరలో కలసి వచ్చే రాజకీయ పార్టీలను కలుపుకొని మధిర ప్రాంతంలో జరిగే పనులను వాటి నాణ్యతను పరిశీలించి ప్రజా ధనం దుర్వినియోగంగా నాశిరకంగా ఉన్న వాటిని గుర్తించి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని అఖిల పక్ష రాజకీయపార్టీ నాయకులతో కలసి అభివృద్ది ముసుగులో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, అలాగే నాసిరక నిర్మాణాలకు కారకులైన సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని కోరానున్నామని తెలిపారు.