టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే వికలాంగుల పెన్షన్ కట్ చేస్తామని బెదిరించిన వికలాంగుల కార్పొ

Published: Tuesday October 26, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 25 ప్రజాపాలన ప్రతినిధి : హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే వికలాంగుల పింఛన్లు కట్ చేస్తామని బహిరంగంగా బెదిరించిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) రంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అంతదుగుల గ్రామంలో జరిగిన వికలాంగుల సమావేశంలో ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి వికలాంగులందరూ ఓటు వేయాలని, ఓటు వేయని వికలాంగుల పెన్షన్ లు తీసేస్తామని బహిరంగంగా వికలాంగులను బెదిరించిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ని వెంటనే అరెస్టు చేయాలి. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ వికలాంగులను బెదిరించడం ఎంతవరకు సమంజసం. వికలాంగులకు జరుగుతున్న అన్యాయం గురించి ఏనాడు మాట్లాడని కార్పొరేషన్ చైర్మన్ ఓట్ల కోసం మాత్రం వికలాంగులను ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. వికలాంగుల కార్పొరేషన్ నుండి జీతం తీసుకుంటూ వికలాంగులను బెదిరించడం ఆయన అహంకారానికి నిదర్శనం. వాసుదేవ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అహంకార పూరితంగా మాట్లాడిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ తక్షణమే వికలాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. వికలాంగులపై బెదిరింపులకు పాల్పడిన వాసుదేవ రెడ్డిని పదవి నుండి తక్షణమే తొలగించాలి. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 92 ఎ ప్రకారం చట్టరీత్యా నేరం. వికలాంగులు కించపరిచే విధంగా వాసుదేవ రెడ్డి మాట్లాడిన 24 గంటలు గడుస్తున్నా 2016 ఆర్పీడీ  చట్టం కమిషనర్ ఎందుకు స్పందించలేదు. తక్షణమే కమిషనర్ సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి వికలాంగులను భయపెట్టే విధంగా బెదిరించిన వాసుదేవ రెడ్డి పై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక హెచ్చరిస్తుంది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి భుజంగ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్కొని రాజు జిల్లా కోశాధికారి దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.