తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఆదర్శం మంత్రి హరీష్ రావు.

Published: Friday December 30, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి:   తెలంగాణ రాష్ట్రం, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే, అన్నింటిలో ముందుండి భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, ఇదంతా ముందు చూపుతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, తన్నీరు హరీష్ రావు అన్నారు.
గురువారం బెల్లంపల్లి పట్టణంలో కెమికల్ ఏరియాలో  17 కోట్లతో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని, డయాలసిస్ కేంద్రాన్ని, వ్యవసాయ శాఖ మంత్రి ఎస్, నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా స్థానిక నెంబర్ టూ క్రీడా మైదానంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు,
 తెలంగాణ ప్రభుత్వం  ప్రజలకు అనుకూలంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్తు, సంస్థ వంటి వివిధ సంస్థలను కాపాడుకుంటూ వస్తుంటే, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, రైల్వే, విశాఖ ఉక్కు, విమానయానం, వంటి సంస్థలను అమ్మే స్తూ, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ, ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను  తొలగించడమే ధ్యేయంగా పెట్టుకుందని అన్నారు.
సింగరేణి కార్మికులు రానున్న రోజుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే సింగరేణి సంస్థను కూడా అమ్మేసే  ప్రయత్నం చేస్తారని కార్మికులందరూ బిజెపి అధికారంలోకి రాకుండా తెలంగాణ బచావో ,  బిజెపి హటావో అనే నినాదంతో ముందుకు పోవాలని కార్మికులను ఉద్దేశించి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక నిరుద్యోగులకు 95 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రెండు లక్షల ఉద్యోగాలు  కల్పించేందుకు ముఖ్యమంత్రి సన్నాహాలు చేస్తున్నారని అన్నారు.
గతంలో అరవై ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, పార్టీలు కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా అందివ్వలేకపోయారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మిషన్ భగీరథ తో ప్రతి ఇంటింటికి శుద్ధమైన త్రాగే నీటిని సరఫరా చేస్తున్నామని అన్నారు.
ఆడపిల్లలు పుట్టగానే వారికి 13 వేల రూపాయలు ఇస్తూ, ఆడ పిల్లలు చదువుకోవడానికి నాల్గు వందల గురుకులాలను ఏర్పాటు చేశామని, పెద్దయినాక కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక  లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్నామని, భారత దేశంలో ఇవన్నీ ఏ రాష్ట్రంలో చేస్తున్నాయో చెప్పాలని ఆయన అన్నారు. 
గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో మూడు మెడికల్ కళాశాలను స్థాపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముప్పై మెడికల్ కళాశాలలు ప్రారంభించి విద్యాబోధన చేయిస్తున్నామని, రానున్న రోజుల్లో మరో నాలుగు మెడికల్ కళాశాలలు నెలకొల్పి జిల్లాకో మెడికల్ కళాశాల ఉండేలా చూస్తామని అన్నారు. 
సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించే మెడికల్ కళాశాలల్లో, కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ ద్వారా సీట్లు ఇచ్చే విధంగా కేసీఆర్ రూపకల్పన చేస్తున్నారని, కార్మికుల పిల్లలు ఈ అవకాశాలను వినియోగించుకొని, కార్మికుల పిల్లలు కార్మికులగా కాకుండా, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాల ఆటంకాలు కల్పిస్తున్నారని, అందులో భాగంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ముప్పై వేల కోట్ల రూపాయలను ఇవ్వలేక ఎందుకు ఆపుతున్నారో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను, కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజలను అందులో బెల్లంపల్లి ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుతూ,  ప్రేమగా చూసుకునేది కేసీఆర్ మాత్రమే నని,  కేంద్రంలో ఉన్న మోడీ కాదని  అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరిక మేరకు
కొత్తగా ఏర్పాటు చేసిన వందపడకల ఆసుపత్రికి సరిపడా వైద్యులను, సిబ్బందిని, వైద్య పరికరాలను, అన్ని త్వరలోనే సమకూరుస్తానని, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల సౌకర్యం లేని ప్రాంతాల్లో రోడ్లు వేయించుకోవడానికి మరో పది  కోట్ల రూపాయలను రానున్న కొద్ది రోజుల్లో మంజూరు చేయిస్తానని  ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎంపీ బికే, వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ దండే విట్టల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్  తొంగల సత్యనారాయణ, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ భారతి హోలీ కేరి, శిక్షణ కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత వైస్ చైర్మన్ సుదర్శన్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఆర్డీవో శ్యామల దేవి, తాసిల్దార్ కుమారస్వామి. పోలీస్ అధికారులు, రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి, డిసిపి అఖిల్ మహాజన్, ఏసిపి ఎడ్ల మహేష్,
నియోజకవర్గంలోని రైతులు, బిఆర్ఎస్ నాయకులు, పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, తదితర ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.