కలకొడిమలో వైభవపేతంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం..

Published: Tuesday April 26, 2022
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సండ్ర..
తల్లాడ, ఏప్రిల్ 25  (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని కలకొడిమ గ్రామంలో సోమవారం రాములోరు, శివలింగం విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ దిరిశాల దాసురావు, తల్లాడ జడ్పిటిసి ప్రమీల దంపతుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠా మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేదపండితుల మంత్రాలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ వేలాది మంది భక్తుల శివనామస్మరణతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింప చేస్తుండగా భక్తులందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వీక్షించారు. ధ్వజస్తంభం మహోత్సవం ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఆంధ్ర సరిహద్దులో ఉండటంతో ఏపీ నుండి కూడా బంధువులు, ఆడపడుచులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గత నాలుగు రోజులుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఐదవ రోజు దేవాలయాలు ప్రారంభించి, వేలాదిమంది ప్రజల హర్షధ్వానాల మధ్య ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. ప్రజలందరూ నూతన వస్త్రాలు ధరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనుకున్న అంచనా కంటే భారీగా భక్త జనసందోహం రావటంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. భానుడు భగభగ మండుతున్నప్పటికీ భక్తులు ఎండను సైతం లెక్కచేయకుండా స్వామి వారికి దర్శించుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు ఆలయ కమిటీ చైర్మన్ దిరిశాల దాసురావు, జడ్పీటీసీ ప్రమీల దంపతులు స్వాగతం పలికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.