సాగునీటిని న్యాయబద్ధంగా రాబడుదాం

Published: Thursday July 22, 2021
వికారాబాద్ 21 జూలై ప్రజాపాలన బ్యూరో : సాగునీటిని న్యాయబద్ధంగా రాబట్టుకోడానికి ఉద్యమంలా పోరాడుదామని చేవెళ్ళ మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సత్యభారతి వేడుక వేదికలో ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన గెజిట్ కా‌రణంగా రాష్ట్రం సాగునీటి విషయంలో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాల్లోని సాగునీటి సమస్యను పరిష్కరించుటకు ఏర్పడినా స్థాయికి మించి స్వతంత్ర నిర్ణయాలతో ఇబ్బందులు సృష్టిస్తుందని పేర్కొన్నారు. కృష్ణా బోర్డు తెలంగాణకు పెద్ద శాపంగా పరిణమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కడే సాధించానని అహంకారంతో తాను ఆడింది ఆటగా పాడింది పాటగా వ్యవరించడం శోచనీయమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జలజగడాన్ని కేంద్రం పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి.రాంమోహన్ రెడ్డి, మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, ప్రొఫెసర్ కోదండరాంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఆర్టీసీ యూనియన్ నేత హనుమంతు ముదిరాజ్, పరశురాంరెడ్డి, బంట్వారం పార్టీ అధ్యక్షుడు వెంకటేశం పిసిసి సంయుక్త కార్యదర్శి చామల రఘుపతి రెడ్డి, యువనాయకులు చాపల శ్రీనివాస్ ముదిరాజ్, జొన్నల రవిశంకర్, వినయ్ యాదవ్, ఆగమయ్య ముదిరాజ్, నవీన్, వివిధ రాజకీయ, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.