విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎఫ్ ఎల్ ఎన్ తొలిమెట్టు

Published: Thursday October 20, 2022
విద్యాశాఖ సంచాలకులు దేవసేన
వికారాబాద్ బ్యూరో 19 అక్టోబర్ ప్రజా పాలన : విద్యార్థులకు  విద్యా ప్రమాణాలు పెంచేందుకు (ఎఫ్ఎల్ఎన్) తొలిమెట్టు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని పాఠశాల విద్య శాఖ సంచాలకులు దేవసేన అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ ( తొలి మెట్టు ) కింద చేపడుతున్న విద్యాబోధనను జిల్లా కలెక్టర్ నిఖిల, ఆదర్శ పాఠశాల అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి లతో కలిసి తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా సంచాలకులు మాట్లాడుతూ.. విద్యార్థులకు కనీస అభ్యసన సామర్ధ్యాలతో పాటు తరగతికి సంబంధించిన అభ్యర్థన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రాథమిక స్థాయి పిల్లలు,  అక్షరాలను గుర్తించడం , చిన్నచిన్న వ్యాసాలు చదవడం,  బేసిక్ మ్యాథ్స్ పై పట్టు సాధించేలా ప్రత్యేక చొరవ చూపాలని ఆమె అన్నారు. నాలుగవ తరగతిలో తెలుగు,  5వ తరగతిలో మాథ్స్ పై  సులభతరంగా,  విద్యార్థులకు  అర్థం అయ్యేలా తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు శివప్ప,  ఆస్మాబేగంలను సంచాలకులు అభినందించారు. అలాగే విద్యార్థులకు  చాక్లెట్స్,  బహుమతులు ఇచ్చి వారిని ప్రోత్సహించారు. విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కాకుండా రోజు తప్పనిసరిగా వచ్చి విద్యను అభ్యసించాలని ఆమె తెలిపారు.
జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ఎఫ్ ఎల్ ఎన్ కింద జిల్లాలో 2004 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక పిల్లవాడు చక్కగా చదువుకోవాలి,  రాయాలి అదేవిధంగా బేసిక్ మ్యాథ్స్ తెలిసి ఉండేలా ఈ కార్యక్రమానికి తీసుకోవడం జరిగిందని ఆమె అన్నారు.  చదువులో వెనుకబడి ఉన్న పిల్లలపై  ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రాథమిక  అభ్యసన వైపు తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ  కార్యక్రమంలో డిఇఓ రేణుకా దేవి, ఎంఈఓ హరిచందర్, ఎఫ్ ఎల్ ఎన్ మండల అధికారి శ్రీశైలం, సెక్టోరల్ అధికారులు రవి,  వెంకటయ్య, సర్పంచ్ యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.