భాషా పండితుల, పి.ఈ‌టి. లతో కూడిన పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలి

Published: Saturday January 21, 2023

రాయికల్, జనవరి20 (ప్రజాపాలనప్రతినిధి):రాష్ట్రం లో చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ లో భాషా పండితులు, పి.ఈటి.తో కూడిన పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు యం.డి.అబ్దుల్లా ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం జగిత్యాల జిల్లా శాఖ పక్షాన జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో భాషాపండితుల పదోన్నతులు, సమస్యల పై రాష్ట్ర శాఖ దృష్టికి తీసుకపోవడంతో   రాష్ట్ర అధ్యక్షులు ఈసందర్భంగా మాట్లాడుతూ భాషా పండితులు 20-30 ఏండ్ల నుండి వెట్టిచాకిరి, శ్రమదోపిడికి గురౌతూ పదోన్నతులు పొందక ఆత్మగౌరవం చంపుకొని పనిచేస్తున్న సమస్యల పరిష్కారానికై భాషాభిమాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి  2017 తెలుగుమహాసభలలో హామి ఇవ్వడంతో భాషాపండిత పోస్టులు అప్ గ్రేడ్ చేయడం జరిగిందని, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ముఖ్యమంత్రి వరమిచ్చినా సంబంధిత అధికారులు అమలు చేయడంలేదని అన్నారు. పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించ బోతున్న తరుణంలో రాష్ట్రంలో గల 10 వేల మంది భాషా పండితులు తీవ్ర నిరాశ నిశ్ప్రుహలకు లోనవుతున్నారని ఆన్నారు. కోర్టు తుది తీర్పులకు లోబడి హైకోర్టు అనుమతి తీసుకొని అన్ని విషయాల, సబ్జెక్ట్ లతో పాటు భాషాపండితుల, పిఈటి లకు పదోన్నతులు కల్పించే విధంగా షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుళ్ళపల్లి తిరుమల క్రాంతి కృష్ణ, రాష్ట్ర కోశాధికారి వి.యస్.యస్. శర్మ,  జగిత్యాల జిల్లా బాధ్యులు చంద సత్యనారాయణ, కటుకం నరేందర్, సంద రాజేందర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.