రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ చర్యలు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుస

Published: Wednesday January 25, 2023
మంచిర్యాల బ్యూరో,    జనవరి 24, ప్రజాపాలన :
 
పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న బియ్యం అక్రమ రవాణా పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి మండలం రవీంద్రఖని రైల్వేస్టేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్రమంగా తరలించేందుకు ప్లాస్టిక్ బస్తాలలో సిద్ధంగా ఉన్న దాదాపు 20 క్వింటాళ్ళ ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యంను స్వాధీనపర్చుకొని మంచిర్యాల ఎం.ఎల్.ఎస్. పాయింట్లో భద్రపరిచి తదుపరి చర్యలకై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అక్రమదారులు దుర్భాషలాడుతూ అధికారులపై రాళ్ళతో దాడికి పాల్పడగా అక్రమదారులను గుర్తించి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని తహశిల్దార్ను ఆదేశించారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం వ్యాపారం చేయకూడదని, అక్రమ రవాణాకు పాల్పడకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీ లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.