సమాజానికి సేవ చేసే వారికి ఎప్పుడూ మరణం ఉండదు

Published: Monday April 25, 2022
మాజీ న్యాయమూర్తి, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్  జి.చంద్రయ్య
బెల్లంపల్లి ఏప్రిల్ 24 ప్రజా పాలన ప్రతినిధి: సమాజానికి సేవ చేసే వారికి ఎప్పుడు మరణం లేదని, వారు చేసిన సేవలను ప్రజలు గుర్తిస్తూ ఎప్పుడు యాదిలో ఉంచుకుంటారని, మాజీ న్యాయమూర్తి, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్, జి.చంద్రయ్య అన్నారు. ఆదివారం స్థానిక తాపీ సంఘం భవనంలో, ఏబూసి పోచం పటేల్, ట్రస్ట్ చైర్మన్, ఏబూసి యాదగిరి, ప్రధమ వర్ధంతి  సందర్భంగా ఏర్పాటుచేసిన సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరై సంతాపం తెలిపి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  కొంతమంది వ్యక్తులు చనిపోగానే, వారిని కొద్దిరోజుల్లోనే మర్చిపోతారని, కానీ మానవ సంబంధాల అభివృద్దే ముఖ్యంగా భావించి, పని చేసిన వ్యక్తులను ఎవరు మర్చిపోలేనని, అందులో ఆధ్యాత్మికంగా, లౌకికంగా, పని చేసిన వారిని ఎవరు వారి హృదయాల్లో నుండి తొలగించుకో లేరనీ అన్నారు. యాదగిరి చదువు లేకపోయినా ప్రపంచాన్ని చదివిన వ్యక్తి అని ఆయనలో అనురాగం, ఆప్యాయత, ప్రేమ, అన్ని ఉన్నాయి కాబట్టే, ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారని, అన్నారు, ఒక మామూలు వ్యక్తిగా పరిచయమైన వ్యక్తి, వేలాది మందిలో ఐఏఎస్,  ఐపిఎస్, లు ఉన్నటువంటి సభలు, సమావేశాలలో, ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఎంతో అర్థవంతంగా ప్రసంగించి అభినందనలు పొందాడు అంటే, ఆయన ఎంత సమర్థవంతుడో  అర్థం చేసుకోవాలి అని అన్నారు. మనం ఎంత బలంగా ఉంటామో, కుటుంబం అంతా బలంగా ఉంటుందని, కుటుంబాలు బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటాయనే నమ్మకం తో పనిచేసే వ్యక్తి, అలాంటివి మానవ సంబంధాలకు ప్రాముఖ్యత నిచ్చే యాదగిరి మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మన మధ్యలో ఉంటాయని ఆయన ఆశయాలను ఆచరణలో ఉంచుతూ, కొనసాగించాలని అన్నారు. యాదగిరి కోసం, ఆయన చేసిన సేవలను గుర్తించి, రాసిన రచనలను, పొందిన సహాయాలను, అక్షర రూపంలో పెట్టి, ట్రస్ట్ చైర్మన్ లతకు పంపినట్లయితే ఆయన ఆలోచనలను, చేసిన సేవలను, పుస్తకరూపంలో ప్రజలకు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఏబూసి యాదగిరి, బెల్లంపల్లి పట్టణంలో కార్మికుల మధ్యలో నుండి వచ్చిన వ్యక్తని, నలుగురికి సహాయపడే వ్యక్తిగా సేవలందించే వారని, ఆయన పేరున ఒక సావనీర్ను తీసుకురావాలని, ప్రతి సంవత్సరం ఒక లెక్చర్ , ఏర్పాటు చేసి  స్మరించుకునే ఏర్పాటు చేయాలని అన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనల్ని, మనం ముందుకు తీసుకుపోవడానికి కృషి చేద్దామని, ఆయన స్మృతులను సజీవంగా అందరికి తీసుకుపోవడానికి కృషిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ జడ్జి, డాక్టర్ యతిరాజులు అధ్యక్షత వహించగా, ట్రస్ట్ ఉపాధ్యక్షులు బోనాల మురళి చారి, ఆదిలాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  క్షమా దేశ్పాండే, బెల్లంపల్లి జడ్జి, జి, హిమబిందు, బెల్లంపల్లి ఎమ్మెల్యే, దుర్గం చిన్నయ్య,  ఆర్ డి ఓ, శ్యామలా దేవి, రిటైర్డ్ డి.ఎస్.పి రవికుమార్, రచయిత, గాయకుడు, జర్నలిస్టు, పాముల రామచందర్, ఏ బూసి ఆగయ్య, సబ్బని కృష్ణ, జంగంపల్లి రాజమల్లు, చిప్ప నరసయ్య, యాదగిరి భార్య ట్రస్ట్ చైర్మన్ లత, కుమార్తెలు మాలతి, డాక్టర్ అనురాధ, అల్లుడు సతీష్, ఆయన చిన్ననాటి స్నేహితులు మిత్రులు, అధిక సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు. కళాకారులు యాదగిరి పై పాడిన పాటలకు, హాజరైన వారందరూ కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం వివిధ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసి వారికి ట్రస్టు తరఫున శాలువాలతో సన్మానించారు.