బ్యాలెట్ పత్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన

Published: Friday March 10, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన :  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బ్యాలెట్ పత్రాలను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( బాలుర ) లో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో  కలెక్టర్ సి. నారాయణ రెడ్డి  పరిశీలించారు.  ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు  ఏర్పాట్లపై పలు సూచనలు జారీ చేశారు.  బ్యాలెట్ బాక్స్ లపై బాక్స్ నెంబరు, పోలింగ్ కేంద్రాల నంబర్లను స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్లు వేయాలన్నారు.  పోలింగ్ నిర్వహణ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను నేరుగా సరూర్ నగర్ కు తరలించాలని సూచించారు.  స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.  పోలింగ్ కేంద్రాలకు తలుపులు కిటికీలు బాగు చేసుకోవాలని, అలాగే కేంద్రంలో విద్యుత్తు, ఫ్యాన్లు, త్రాగునీరు మరుగుదొడ్లు  తదితర ఏర్పాట్లు చేసుకోవాలని  తాసిల్దారుకు ఆదేశించారు.  ఈనెల 13న జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు రేపటి వరకు పూర్తి చేసుకోవాలాని సూచించారు.
* జడ్పీహెచ్ఎస్ ( బాలురు ) ఆకస్మిక తనిఖీ :
అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు రిజిస్టర్, మధ్యాహ్న భోజన స్టాక్ రిజిస్టర్, పాఠశాల అభివృద్ధికి మంజూరైన నిధుల రిజిస్టర్, బిల్లులను కలెక్టర్ తనిఖీ చేశారు.  కొంతమంది ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనానికి వెళ్లి ఆలస్యంగా రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.  సెలవులపై వెళ్లిన ఉపాధ్యాయుల సెలవు దరఖాస్తులను పరిశీలించారు.  పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో పొంతన లేకపోవడంపై పాఠశాల హెడ్మాస్టర్ ను ఆరా తీశారు.  పాఠశాలలో మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉండటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, మధ్యాహ్న భోజనం వివరాలు సరిగా లేకపోవడం వల్ల పాఠశాల హెడ్మాస్టర్ శ్రీహరిని బదిలీ చేస్తున్నట్లు ఆదేశించారు.  పాఠశాలకు తిరిగి వస్తానని, తప్పనిసరిగా మార్పు కనిపించాలని లేకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి, వికారాబాద్ తహసిల్దార్ వహీద ఖాతూన్, ఎలక్షన్ డి.టీ. రవీందర్ దత్తు తదితరులు పాల్గొన్నారు.