*బ్లాక్ సిగ్నేచర్ పుస్తకావిష్కరణ*

Published: Wednesday December 28, 2022

మధిర  డిసెంబర్ 27 (ప్రజా పాలన ప్రతినిధి) ఖమ్మం జిల్లా మధిరకు చెందిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మాటూరు పేట హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయులు వేము రాములు రచించిన బ్లాక్ సిగ్నేచర్ (దళిత సాహిత్య వ్యాసాలు) గ్రంధ ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హిందీ విభాగాధిపతి ఆచార్య డాక్టర్ జి.వి. రత్నాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎవరికోసమైతే ఈ దళిత సాహిత్యం రాస్తున్నారో అటువంటి దళితులందరికీ ఈ సాహిత్యం అందుబాటులో ఉండాలన్నారు. ఈ సాహిత్యం దళితుల్లో చైతన్యo తీసుకురావాలని అపుడే ఈ సాహిత్యం వల్ల ప్రయోజనం ఉంటుందని వారు పేర్కొన్నారు. అనంతరం హైదరాబాదు యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి ఆచార్య డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు చేతులు మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించి మరుగున పడిపోతున్న దళితుల సాహిత్యం వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఎవరి మూలాలు వారు తెలుసుకొని తమ తమ ఆస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, వారు వారి సాహిత్యాన్ని సృజించాలని ఆయన కోరారు. అలాగే కవి,రచయిత విమర్శకులు,పరిశోధకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అనాధరణకు గురికాబడిన ప్రతి జాతి, ప్రతి సమూహము యొక్క సాహిత్యాన్ని పునర్మించుకోవాలన్నారు. భూతం ముత్యాలు రచనలపై వేము రాములు రాసిన వ్యాసాలు భూతం ముత్యాలు యొక్క సమగ్ర సాహిత్య చరిత్రను తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కాకతీయ యూనివర్సిటీ ఆచార్య డాక్టర్ బన్నా ఐలయ్య  మాట్లాడుతూ భూతం ముత్యాలుకు మంచి భవిష్యత్తు ఉందని భూతం ముత్యాలు రచనలపై వేము రాములు రాసిన వ్యాసాలే బ్లాక్ సిగ్నేచర్ అంటూ ఇందులోని వ్యాసాలన్ని భూతం ముత్యాలు సమగ్ర సాహిత్యాన్ని తెలియజేస్తున్నాయని, వేము రాములు బాగా రాశారని, భవిష్యత్తులో వేము రాములు మంచి వ్యాసకర్త అవుతారని అన్నారు. అనంతరం వేము రాములు  రచించిన బ్లాక్ సిగ్నేచర్ పుస్తకాన్ని అంకితం ఇవ్వగా ఆచార్య డాక్టర్ బన్న ఐలయ్య  సహృదయంతో స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గంజికుంట్ల రామారావు, వెంకటేశ్వరరెడ్డి, ఎలగొండ రాములు, మంథని శంకర్, పిల్లి మల్లికార్జున్, పిహెచ్డి చేస్తున్న వివిధ యూనివర్సిటీల పరిశోధకులు విద్యార్థులి పాల్గొన్నారు.