ఘనంగా జరిగిన బక్రీద్ వేడుకలు

Published: Monday July 11, 2022

ఈదుగా మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు

 శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ మండల మైనారిటీ సెల్ టిఆర్ఎస్ అధ్యక్షుడు గయాజ్

వికారాబాద్ బ్యూరో జూలై 10 ప్రజా పాలన : త్యాగనిరతిని తెలిపే బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఈద్గా మసీదుల్లో ఈద్ ఉల్ జుహా సందర్భాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వికారాబాద్ మండల పరిధిలోని పులమద్ది గ్రామానికి చెందిన మండల టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గయాజ్ అతని కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆదం(అ.స.) నుంచి మొహమ్మద్‌(స.అ.వ.) వరకు అల్లాహ్‌ పంపిన ప్రవక్తల పితామహుడిగా ఇబ్రహీం(అ.స.) పేరు పొందారు. సంఘసంస్కరణ, అల్లాహ్‌పై విశ్వాసం ఆయనకు అగ్నిగుండం నుంచి నవ్వుతూ బయటకు రాగలిగే శక్తినిచ్చాయి. ఆయన జీవితానికి అల్లాహ్‌ ఆజ్ఞాపాలనలకు నిదర్శనంగా ఇస్లాంలోని రెండో పండుగ బక్రీద్‌ నిలిచింది. తలార స్నానమాచరించి మంచి దుస్తులు ధరించి పిల్లల్ని పెద్దల్ని అందర్నీ పేరుపేరునా పలకరించి, ఎలుగెత్తి అల్లాహు అక్బర్‌ తక్బీర్‌ పఠిస్తూ బక్రీద్‌ పండుగ నమాజుకై ఈద్గాహ్‌ మైదానానికి తరలివెళ్ళే దృశ్యం ఎంతో మనోహరం. వారు వేసే ప్రతి అడుగూ స్వర్గానికి అన్నట్లుగా ఉంటుంది. ధర్మపరాయణతను చిన్నవారిలో చిగురింపజేస్తూ పండిన పెద్దలనుంచి అనుభవాల దీవెనలు సమీకరించుకుంటూ నడిచే దారి దివ్యమైనది. శిరసు వంచి అల్లాహ్‌ నామాన్ని స్మరిస్తూ శాంతిదూతలుగా ఏకోన్ముఖులై చేసే పండుగ నమాజ్‌ విశిష్టమైంది. అనంతరం ఇమామ్‌ ఇచ్చే ఖుత్బా ఉపన్యాసం విని తెలియని ఎన్నో విశేషాలు ఇస్లాం ధర్మసూక్ష్మాలు తెలుసుకున్న తృప్తితో ప్రతి వ్యక్తి ముఖవర్ఛస్సు రెట్టింపు అవుతుంది. అల్లాహ్‌ శుభశ్రేయాలు, కరుణాకటాక్షాలు ఎదుటివారికి అందాలంటూ బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపుకొనే ఆనందంతో సమసమాజ సౌందర్యం అద్భుతంగా ఇనుమడిస్తుంది.

*ఈద్గాహ్‌ నుంచి తిరిగి వచ్చి : ఖుర్బానీ ఇవ్వాలన్న నియమాన్ని స్తోమత గల ముస్లిములందరికీ విధిగా నిర్ణయించినట్లు హదీసులు బోధిస్తున్నాయి. ‘పూర్తి ఏకాగ్రతతో ఇబ్రహీం ధర్మాన్ని అనుసరిస్తున్నాను. నా నమాజ్‌, నా ఖుర్బానీ, నా జీవన మరణాలు అన్నీ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్‌కే. భాగస్వాములెవరూ లేని అల్లాహ్‌ ముందు తలవంచేది నేనే. నీవు ప్రసాదించిన జంతువును నీ కోసమే సమర్పిస్తున్నాను’ అంటూ ఖుర్బానీ ఇస్తున్న వ్యక్తి ప్రార్థిస్తాడు. బక్రీద్‌ మాసపు నెలవంక చూసినప్పటి నుంచి బక్రీద్‌ రోజు ఖుర్బానీ ఇచ్చేంతవరకు శరీరంలోని గోళ్లను, వెంట్రుకలను కత్తిరించక నియమనిష్ఠలతో ఉంటాడు. ఖుర్బానీ ఇచ్చిన జంతుమాంసంలోని మూడు భాగాలు పేదలకు, బంధువులకు ఇంటివారికి పంచుతారు. నిరుపేదలకు రుచికరమైన ఆహారం తినే హక్కుందని అల్లాహ్‌ సందేశం. కన్న కొడుకును ఖుర్బానీ ఇవ్వదలచిన ఇబ్రహీం(అ.స.) అల్లాహ్‌ పెట్టిన పరీక్షలో నెగ్గారు. ఆ గెలుపును త్యాగాన్ని విశ్వాసాన్ని వేవేల సంవత్సరాలు విశ్వాసులు స్మరిస్తారు. అల్లాహ్‌ ఆదేశాల పాలనకు నిబద్ధులమై ఉంటామని సంకల్పించే రోజు బక్రీద్‌ పండుగరోజు. హజ్‌ యాత్రికులు బక్రీద్‌ రోజున ఉషోదయానికి ముందే అరాఫత్‌ మైదానానికి చేరి నమాజ్‌ చేస్తారు. హజ్‌ చేసేవారు అల్లాహ్‌ ప్రతినిధులు. వారి దుఆ అల్లాహ్‌ ఆమోదం పొందుతుంది. మన్నింపు కోరినవారికి మన్నింపు లభిస్తుంది. స్తోమత ఉన్న విశ్వాసులు కాబాగృహం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేసి విధి నిర్వర్తిస్తారు. పాపరహితులైనవారికి స్వర్గమే ప్రతిఫలం అని మొహమ్మద్‌ ప్రవక్త(స.అ.వ.) బోధించారు. యాత్రికులు తిరిగి స్వస్థలాలకు చేరుకొని నీతిమంతులుగా సత్వపథగాములుగా ఇబ్లీసు వక్రీకరణలకు తలొంచక జీవన కార్యకలాపాలు కొనసాగిస్తారు. అల్లాహ్‌ విధేయులై తోటివారికి చుక్కానులై రుజుమార్గంలో నడుస్తారు.