కంటి వెలుగు శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి క

Published: Monday January 23, 2023
మంచిర్యాల బ్యూరో,  జనవరి 21, ప్రజాపాలన :
 
కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి కంటి సమస్య లేకుండా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. 18 సం.ల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరికి శిబిరాలలో పరీక్షలు నిర్వహించి మందులు, అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాలని తెలిపారు. ఈ శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని, పరీక్ష చేసిన వారి వివరాలను ట్యాబ్-1, ట్యాబ్-2లలో నమోదు చేయాలని తెలిపారు. రోజు వారిగా శిబిరాలలో మందులు, కంటి అద్దాల నిల్వ వివరాలను జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని కంట్రోల్ రూమ్లో తెలియజేయాలని, శిబిరాల నిర్వహణలో సమయపాలన పాటించాలని తెలిపారు. శిబిరానికి వచ్చే ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ కొరకు 40 కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షల కోసం శిబిరాలకు వచ్చే ప్రజలకు త్రాగునీరు, షామియానా, కుర్చీలు మౌళిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలకు వచ్చే వారి వివరాలను ట్యాబ్లలో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, పంచాయతీరాజ్, సంబంధిత శాఖల సమన్వయంతో శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, వైద్యాధికారి డా. ఫయాజ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.