ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య దురదృష్టకరం

Published: Thursday November 24, 2022
జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 23 నవంబర్ ప్రజాపాలన : భద్రాద్రి కొత్తగూడెం అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ హత్య దురదృష్టకరమని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా అటవీ శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ చిత్రపటానికి అటవీ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్ రెడ్డితో పాటు అటవీ శాఖ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి ప్రాంతాన్ని రక్షించేందుకు మ్యాన్ ఫోర్స్ పెంచాలని సూచించారు. అటవీ శాఖ సిబ్బందికి ఆయుధాలు, ఆధునిక వాహనాలు కేటాయించాలని పేర్కొన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారని చెప్పారు. అటవీ ప్రాంత భూముల రక్షణే అటవీ శాఖ అధికారుల విధి అని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా అమలు చేసే అటవీశాఖ సిబ్బందిపై దాడులు చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అటవీశాఖ భూములన్ని అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం మిగిలిన అటవీ శాఖ భూములను రక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్షించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ లు ఎఫ్ఎస్ఓ లు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.