కొనుగోలు కేంద్రాలలో సదుపాయాల ఏర్పాటు : జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

Published: Thursday December 09, 2021
మంచిర్యాల బ్యూరో‌, డిసెంబర్ 8, ప్రజాపాలన : ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రైతుల సౌకర్యార్థం సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమకుమార్తో కలిసి రైస్మిల్లర్లు, ఏజెన్సీలతో వరిధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 237 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనుగోలు చేయాలని, విక్రయించిన ధాన్యంకు సంబంధిత రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వడంతో పాటు రిజిస్టర్లు తప్పనిసరిగా నిర్వహించాలని, నాణ్యమైన వరిధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, తాలు పేరుతో వరిధాన్యం తరుగు తీయరాదని తెలిపారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులు, తీసుకువచ్చిన ధాన్యం వివరాలను ట్యాబ్లో నమోదు చేసిన 48 గం॥ల లోగా విక్రయ సొమ్మును సంబంధిత రైతుల ఖాతాలలో జమ చేయాలని తెలిపారు. గోనె సంచుల కొరత లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ సమన్వయంతో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ సారి 1 లక్షా 74 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం లక్ష్యం కాగా మాసాంతం, జనవరి - 2022 మొదటి వారంలోగా కేటాయించిన నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు చేసిన వరిధాన్యంను రైస్మిల్లులకు తరలించే బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదేనని తెలిపారు. వరిధాన్యం విక్రయం, కొనుగోలు కేంద్రాలు ఇతరత్రా వివరాలను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రైతుల కోసం కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్ 6303928682 ఏర్పాటు చేయడం జరిగిందని, వివరాలు తెలుసుకోవడంతో పాటు ఫిర్యాదులు చేసేందుకు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, రైసిమిల్లర్ల సంఘం అధ్యక్షుడు నల్మాసు కాంతయ్య, రైస్ మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.