మండలంలో అక్రమ చెరువు మట్టి తోలకాలు ,పట్టించుకోని అధికారులు

Published: Monday June 20, 2022

బోనకల్, జూన్ 19, ప్రజాపాలన ప్రతినిధి: మండలంలో చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలను విపరీతంగా తోలుకుంటున్న అధికారులు మాత్రం ఏమి పట్టించుకున్న పాపాన లేదు.వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా డోకా లేదని, మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల చెరువుల్లో అక్రమ మట్టి తరలిస్తున్న అక్రమార్కులకు అధికారులకు సరిగ్గా సరిపోయేలాగా ఉంది.వివరాల్లోకి వెళ్లితే మండల వ్యాప్తంగా గల చెరువులలో ఏటువంటి అనుమతులు లేకుండా వేల ట్రక్కుల మట్టిని దర్జాగా తోడేస్తున్నారు. మండలంలో ఇంత జరుగుతున్నా అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టిని తోడేస్తున్న కానీ అధికారులకు సమాచారం ఉన్నా కానీ పట్టించుకోకపోవడంతో అధికారులకు ఏ స్థాయిలో ముడుపులు అందాయని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఆదివారం రోజున రావినూతల చెరువులో అక్రమ మట్టి తరలిస్తున్నారని స్థానికులు సమాచారం ఇవ్వడంతో రెండు జెసిబిలను ఎన్ఎస్పి జెఈ శాంతశ్రీ పోలీసుల సహకారంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు.పోలీస్ స్టేషన్ కు వచ్చిన రెండు గంటల వ్యవధిలోనే జేసిబిలను అధికారులు వదిలివేయడంతో మతలబు ఏమి జరిగి ఉంటుందో అని పలువురు చర్చించుకుంటున్నారు. అధికారులే వారికి రాత్రి వేళల్లో, సెలవు దినాల్లో తోలుకొమ్మనే సలహాలు అందిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.ఇదంతా గమనిస్తుంటే అసలు మండలంలో అధికారుల విధులు నిర్వహిస్తున్నారా? లేక కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తున్నారా? అనే సందేహం మండల ప్రజలకు కలుగుతుంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి విధినిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకొని మట్టి అక్రమార్కుల బారినుండి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.