ఎర్రవల్లి గ్రామంలో కోవిడ్ అవగాహన : మిషన్ ఆసుపత్రి డాక్టర్ అవినాష్

Published: Tuesday May 04, 2021
వికారాబాద్ మే 03 ప్రజాపాలన బ్యూరో : కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో గ్రామీణ వాసులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉన్నదని మిషన్ ఆసుపత్రి డాక్టర్ అవినాష్ అన్నారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మల్లమ్మ హన్మంతు, ఉపసర్పంచ్ నజీమున్నీసా గఫార్, వికారాబాద్ మండల కో ఆప్షన్ మెంబర్ జాఫర్, కార్యదర్శి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో సాధు సత్యానంద్ స్వామి సమక్షంలో కోవిడ్ 19 సెకండ్ వేవ్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అవినాష్ మాట్లాడుతూ..కోవిడ్ వ్యాధి అందరిలో ఉంటుందని పేర్కొన్నారు. ఇమ్యూనైజేషన్ పవర్ ఎక్కువగా ఉన్న వారు త్వరగా కోలుకుంటారని గుర్తు చేశారు. ఇమ్యూనైజేషన్ పవర్ తక్కువగా ఉన్న వారికి శ్వాసకోస ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. అత్యాధునిక ఆసుపత్రులలో అన్ని మౌళిక వసతులు ఉండడంతో మెరుగైన వైద్య చికిత్సలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. పల్లె వాసులు అందుబాటులో ఉన్న వాటితోనే శ్వాసకోస ఇబ్బందులను నివారించుకోవచ్చని చిట్కాలను చేసి చూపించారు. ఊపిరి బాగా పీల్చుకొని బలూన్ ( ఊపిరి బుగ్గ ) ఊదడం, గ్లాసులో నీరు పోసి స్ట్రా సహాయంతో ఊదడం, నిమిషం పాటు ఊపిరిని నిలుపుకోవడం వంటి చిట్కాలు శ్వాస కోస ఇబ్బందులను దూరం చేసుకోవచ్చని వివరించారు. రోగం రాకున్నా వచ్చి నట్లు అనుమానంతో ఆత్మ స్థైర్యాన్ని కోల్పోరాదని భరోసా కల్పించారు.