విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

Published: Wednesday February 15, 2023
 మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 14, ప్రజాపాలన :
 
ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డు పోటీలలో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చేసి జాతీయ అవార్డు పొందడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమితో కలిసి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డు పోటీలలో జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని సాయిలు సాయి శ్రీవల్లి మహిళలకు ఉపయోగపడే రుతుమిత్ర కిట్ తయారు చేసి జాతీయ స్థాయి అవార్డు పొందడం సంతోషంగా ఉందని తెలిపారు. కేరళలో నిర్వహించిన దక్షిణ భారత స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో గైడ్ ఉపాధ్యాయుడు దేవ రాజయ్య ఆధ్వర్యంలో జాడి జగదీశ్వర్ తయారు చేసిన ఎలక్ట్రికల్ స్పైడర్ క్లీనర్ ద్వితీయ బహుమతి పొందారని, టీచర్ టి.ఎల్.ఎం.లో తాండూర్ మండల కాసిపేట మండల ప్రాథమికోన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు గంప శ్రీనివాస్ అత్యుత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాలలో తడి, పొడి చెత్త నిర్వహణ కొనసాగుతున్న కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చెత్త విభజన నిర్వహణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, సెక్టోరల్ సమన్వయకర్త చౌదరి, జన్నారం మండల విద్యాధికారి విజయ్కమార్, శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ జోబిన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.