వృక్ష సంపదతో గ్రామ ఆర్థిక అభివృద్ధి * 20వేల మొక్కలు నాటి సంరక్షించడమే లక్ష్యం * పట్లూరు గ్రామా

Published: Saturday July 23, 2022
వికారాబాద్ బ్యూరో 22 జూలై ప్రజా పాలన : వృక్ష సంపదతో గ్రామ ఆర్థిక అభివృద్ధి చెందుతుందని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవర దేశి ఇందిర అశోక్ అన్నారు. శుక్రవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో హోమ్ సీడ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పలు రకాల మొక్కలను పంపిణీ చేశారు. జామ అల్లనేరేడు అంజూరు కరివేప గన్నెర చింత గుల్ మోర్ లాంటి మొక్కలను ఇంటింటికి పంపిణీ చేశామని పేర్కొన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా కోన కార్పస్ బాదం చైనా బాదం మైదాకు కానుగ తదితర మొక్కలను నాటి సంరక్షిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పచ్చందాల హరివిల్లుగా గ్రామాన్ని తీర్చిదిద్దగలిగితే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం నివారణకు వృక్ష సంపద ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేశారు. వృక్ష సంపద ఎక్కువ ఉన్న గ్రామం వర్షాలు విరివిగా కురిసి కరువు కాటకాలను నిలువరిస్తాయని వివరించారు. వృక్షో రక్షతి రక్షితః అనే నానుడిని నేటి యువతకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. పండ్ల మొక్కలు పూల జాతి మొక్కలతోపాటు ఔషధ మొక్కలు కూడా నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను పసిపాపలా రక్షించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహిజ్, వార్డ్ మెంబర్స్ ఒగ్గు నర్సిములు, నీలమ్మ, పంచాయతీ కార్యదర్శి సంతోష, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షులు జి. అశోక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.