కాన్షీరామ్ కు భారతరత్న ప్రకటించాలి : సువర్ణ కౌర్ హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Monday March 06, 2023

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టి దేశ వ్యాప్తంగా బహుజనులకు సామాజిక న్యాయం జరగాలని పోరాటం చేసిన యోధుడు మాన్యశ్రీ కాన్షీరామ్ కు వెంటనే భారతరత్న ప్రకటించాలని అన్నారు కాన్షీరామ్ సోదరి,కాన్షీరామ్ ఫౌండేషన్ చైర్మన్ సువర్ణ కౌర్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజాసంఘాల చైర్మన్ గజ్జెల కాంతం అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి సారిగా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లో కాన్షీరామ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరం అన్నారు. బహుజనులందరు ఐకమత్యంగా ఉండి కాన్షీరామ్ ఆశయాల సాధనకు పోరాడాలన్నారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించడం కాన్షీరామ్ కల అని అన్నారు. గజ్జెల కాంతం మాట్లాడుతూ కాన్షీరామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత మనందరిది అన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన పదేళ్లలో ఉత్తరప్రదేశ్ లో సామాజిక న్యాయం కోసం పార్టీ అధికారం లోకి వచ్చేలా కాన్షీరామ్ కృషి చేశారన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని సంపూర్ణంగా అమలు పరచిన ఘనత కాన్షీరామ్ దే అన్నారు.ప్రస్తుతం ఆయన ఏర్పాటు చేసిన పార్టీ క్యాడర్ మొత్తం అక్కడి అధికార పార్టీ కి తాకట్టు పెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బి ఎస్ పి అధినేత్రి బహెన్ జి మాయావతి పాటిస్తుందని విమర్శించారు. కాన్షీరామ్ ఆశయాలు పాటిస్తున్న అందరిని ఏకతాటి పైకి తెచ్చి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. భారత పార్లమెంట్ కు వెంటనే అంబేద్కర్ పేరు పెట్టాలని,కాన్షీరామ్ కు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాన్షీరామ్ ఫౌండేషన్ కార్యదర్శి లక్బీర్ సింగ్, రవీందర్ సింగ్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఓరుగంటి వెంకటేష్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.