పీలారం గ్రామంలో బహుజనులపై దాడులు ఇంకెన్నాళ్లు..?

Published: Saturday October 08, 2022
వర్గ పోరుకు ఆజ్యం పోస్తున్న ప్రజాప్రతినిధి
* దసరా పండుగ రోజు బహుజనులపై విచక్షణ రహితంగా దాడులు
* గ్రామ ప్రథమ పౌరురాలు దళిత సర్పంచుకు తీవ్ర అవమానం
వికారాబాద్ బ్యూరో 7 అక్టోబర్ ప్రజాపాలన :  ఆయన చెప్పిందే వేదం, లేదంటే దాడులే. 
కులాల పేరుతో గొడవలకు ఆజ్యం పోస్తూ గ్రామ వాతావరణాన్ని ఐక్యతను దెబ్బతీస్తున్న ప్రజా ప్రతినిధి. పోలీసులకు ఫిర్యాదు చేసిన పీలారం గ్రామస్థులు.

పీలారం గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ మహిపాల్ రెడ్డి ఆయన వర్గం వ్యక్తులు కులాల పేరుతో మాపై దాడులకు దిగుతున్నారని బహుజనులు చాకలి మల్లయ్య కుమ్మరి అనంతయ్య కుమ్మరి మహేందర్ కుమ్మరి బుడ్డయ్య కుమ్మరి రవి కుమ్మరి లలిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దసరా పండుగ రోజు అయిన గత బుధవారం రాత్రి అకారణంగా మా ఇండ్ల పైకి వచ్చి దాడులు చేశారని బాధితులు గురువారం వికారాబాద్ పట్టణ సీఐ టంగుటూరి శ్రీనుకు ఫిర్యాదు చేశారు. పీలారం గ్రామానికి చెందిన మాజీ జడ్పిటిసి  మహిపాల్ రెడ్డి అనుచరులు పోలీసు రాంరెడ్డి, ఆదొండ వెంకట్ రాంరెడ్డి, ఆదొండ సత్తిరెడ్డి, ఆదొండ సంతోష్ రెడ్డి, ఉపసర్పంచ్ షకీల్ పాష, పాషలతో కలిసి అకారణంగా మా ఇండ్ల పైకి వచ్చి దాడులు చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. మహిళలపై సైతం అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. బహుజనులపై దాడులు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ పట్టణ సిఐ టంగుటూరి శ్రీనుకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ముఖ్యంగా హత్యాయత్నం చేసే ఉద్దేశంతో రాడ్లు కర్రలతో దాడులు చేయడం అమానవీయమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల్లో బాధితులైన చాకలి మల్లయ్యకు నాలుగు కుట్లు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పీలారం గ్రామంలో మహిపాల్ రెడ్డి వర్గీయుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి వారి నుంచి మా ప్రాణాలు కాపాడాలని సిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. దసరా ఉత్సవాలలో భాగంగా జంబిని తేవడానికి వెళ్లే క్రమంలో గ్రామ ప్రథమ పౌరురాలు దళిత సర్పంచ్ కొంపల్లి భారతమ్మ నరసింహులును చిన్నచూపు చూస్తూ ఉత్సవానికి రానివ్వలేదని సర్పంచ్ భర్త కొంపల్లి నర్సింలు ఆరోపించారు. గ్రామానికి సంబంధించిన ఏ ఉత్సవాన్ని అయినా గ్రామ ప్రథమ పౌరురాలు ఆధ్వర్యంలో ఘనంగా ఐకమత్యంగా నిర్వహిస్తారని అన్నారు. రాజకీయ కక్షతో తన ఉనికి ఎక్కడ దెబ్బతింటుందోనని భయపడి ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు రాజకీయ పదవులు లభించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల ప్రకారం పీళారం గ్రామానికి ఎస్సీ కోటాలో సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగిందని వివరించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పిలారం గ్రామ సర్పంచ్ కొంపల్లి భారతమ్మ నరసింహులు దసరా ఉత్సవాలలో పాల్గొననీయకుండా దూరంగా ఉంచడం సిగ్గుచేటని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు సమన్వయంతో ప్రతి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకునేలా కృషి చేస్తే బాగుంటుందని ఆశిద్దాం.