గిలిగెట్ పల్లిలో ఎడ్ల బజార్ నిర్మాణం

Published: Thursday July 15, 2021
మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్
వికారాబాద్ జూలై 14 ప్రజాపాలన బ్యూరో : వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గల గిరిగెట్ పల్లిలోని సర్వే నంబర్ 28/1లో 5ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎడ్ల బజార్ నిర్మించనున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ పాపగారి విజయ్ కుమార్ అన్నారు. బుధవారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ.. ఆలంపల్లి బిలాదాఖల్ మరియు గంగారంలోని సర్వే నంబర్ 67లో 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో గోదాములు నిర్మించనున్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డులో 36 లక్షలతో కవర్డ్ షెడ్, 30 లక్షలతో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఒక కోటి రూపాయలతో 20 కమర్షియల్ దుకాణాలు నిర్మిస్తామని వివరించారు. 5 కోట్ల నిధులతో రైతుబజార్ లో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. 2020-21వ సంవత్సరంలో మార్కెట్ కమిటీకి 3 కోట్ల 72 లక్షల ఆదాయం మార్కెట్ ఫీజు రూపంలో సమకూరిందన్నారు. 2019-20వ సంవత్సరంలో ఒక కోటి 22 లక్షల ఆదాయం వచ్చిందని వివరించారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు 2 కోట్ల 50 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. 2020-21 లో కాటన్, కందుల ధరలు మినిమమ్ సేల్ ప్రైస్ కన్నా అదనంగా ఉండడం వలన మార్కెట్లో అమ్మకాలు జరిగాయన్నారు. నిర్మాణాలకు వికారాబాద్ మున్సిపాలిటీ ఎన్ఓసి ఇచ్చిందని చెప్పారు. నిధుల మంజూరు కోసం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు రాత్రి బస కొరకు 80 గజాల స్థలాన్ని మున్సిపల్ కేటాయించిందన్నారు. త్వరలో ఈ పనులన్నీ ప్రారంభం కానున్నాయని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు రైతు బీమా వంటి పథకాలను కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అని కొనియాడారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అమ్రాది నర్సిములు, మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, మార్కెట్ సీనియర్ అసిస్టెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.