మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం పట్టివేత

Published: Friday August 26, 2022
ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో పట్టుబడిన బొలెరో, కారు
 
బోనకల్, ఆగస్టు 24 ప్రజా పాలన ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాకు బుధవారం బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 2500 కేజీల నల్ల బెల్లం, 10 కేజీల పటికను బోనకల్ లోని స్థానిక జగ్గయ్యపేట- వైరా ప్రధాన రహదారిలో ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. ఈ సందర్భంగా మధిర ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ... మండల కేంద్రంలోని ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ ఎస్ఐ జి చంద్రశేఖర్ తనిఖీలు చేస్తుండగా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఈ సరుకును గుర్తించారు. బొలెరో వాహనంతో పాటు పైలట్ వాహనంగా వస్తున్న కారును కూడా తనిఖీ చేయగా ఆ వాహనంలోని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని బొలెరో వాహనంతో పాటు కారును సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ తనిఖీలలో ఎక్సైజ్ ఎస్ఐ లు చంద్రశేఖర్, శార్వాణి, హెడ్ కానిస్టేబుల్ ఖాసీం లు ఉన్నారు.