17 సెప్టెంబర్ ను తెలంగాణ విమోచన దినంగా పాటించాలి : పట్టణ బిజెపి అధ్యక్షుడు తూర్పు రాజేందర్ రె

Published: Wednesday September 15, 2021
వికారాబాద్ బ్యూరో 14 సెప్టెంబర్ ప్రజాపాలన : కోట్లాది మంది భారతీయుల నిరంతర పోరాటం అసమాన త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని పట్టణ బిజెపి అధ్యక్షుడు తూర్పు రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు భాగంలో బిజెపి కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రోద్యమంలో తెలంగాణ ప్రజలు తమ వంతు పాత్ర పోషించారని గుర్తు చేశారు. నిజాం నిరంకుశ విధానాలను అమలు చేశారని విమర్శించారు. మతోన్మాద ఖాసిం రజ్వి నేతృత్వంలో రజాకార్లను సృష్టించి ప్రజలపై లెక్కలేనన్ని అత్యాచారాలను చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి తానే రాజునని నిజాం ప్రకటించుకున్నాడని పేర్కొన్నారు. ప్రజలపై అకృత్యాలు అత్యాచారాలు పెరిగిపోవడంతో అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక చొరవ తీసుకుని భారత భద్రతా దళాలను పంపి పోలీస్ చర్యల ద్వారా హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించారన్నారు. 17 సెప్టెంబర్ 1948 న నిజాం నిరంకుశ పాలన నుంచి విమోచన లభించిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలోని జిల్లాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుంటే తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ భాస్కర్ రెడ్డి వివేకానంద రెడ్డి శివ ప్రసాద్ సుదర్శన్ రెడ్డి ఇ గోపాల్ రెడ్డి రఘుపతి రవితేజ రవితేజ అ కార్తీక్ గౌరీ రెడ్డి ఇ సందీప్ అర్జున్ రెడ్డి సురేష్ గౌడ్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.