నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులు

Published: Tuesday April 19, 2022
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 18 ఏప్రిల్ ప్రజాపాలన : నిరుద్యోగ యువత ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పరిగి నియోజకవర్గ కేంద్రంలోని కెఎస్ఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి  ఏర్పాటు చేసిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి. కానిస్టేబుల్, ఎస్ ఐ, గ్రూప్ 3, గ్రూపు 4, టెట్ లకు సంబంధించి పిజెఆర్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిభిరంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, డిసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఉచిత శిక్షణా శిభిరం ఏర్పాటు చేసిన శాసన సభ్యులు మహేశ్వర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ లో కింది నుండి పై స్థాయి వరకు ఖాళీలు తీసుకొని 80 వేల పై చిలుకు ఉద్యోగాలు భర్తీ చేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. ఇందులో విద్యా శాఖలో 20 వేలు, పోలీస్ శాఖలో 20 వేల ఖాళీలు గుర్తించి భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 80 వేలలో సగం ఈ రెండు శాఖలవే ఉండటంతో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల వారికి తక్కువ అవకాశాలు వచ్చేవి, నూతన జిల్లాలు ఏర్పాటు చేసి జోన్లు చేయడంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. ఇష్టపడి, కష్టపడి చదవండి... ప్రభుత్వ ఉద్యోగాలు సాదించండని హితవు పలికారు. నాడు అనేక కష్టాలు పడి ఉద్యోగాలు పొందిన అనేక మంది నేడు మీకు స్ఫూర్తి ప్రదాతలని వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థుల కోసం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పుస్తకాలు  అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పరిగి లైబ్రరీలో కూడా అభ్యర్థులు అడిగిన పుస్తకాలు సమకూర్చడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రయివేటు కోచింగ్ సెంటర్ లలో వేలాది రూపాయలు ఫీజులు కట్టకుండా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు శిక్షణా శిభిరాలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని గుర్తు చేశారు.