పులమద్ది పాఠశాలకు కీర్తిప్రతిష్ఠలు తేవాలి

Published: Friday April 09, 2021
వికారాబాద్ మండల టిఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గయాజ్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 08 ( ప్రజాపాలన ) : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏ విద్యార్థి కూడా చదువులో వెనుకంజ వేయరాదని వికారాబాద్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు గయాజ్ హితవు పలికారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలో గల పులుమద్ది గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ ను ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో ప్రతి సబ్జెక్టును ఇష్టంతో చదవాలని సూచించారు. నామ్ కే వాస్తే పుస్తకాన్ని ముందేసుకొని దిక్కులు చూడరాదని పేర్కొన్నారు. నేను తప్పక అత్యుత్తమ గ్రేడ్ సాధిస్తాననే సంకల్పంతో చదవాలని వివరించారు. నేను చదివిన పాఠశాలకు కన్న ఊరికి చదువు చెప్పిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్ఠలు తెస్తాననే నమ్మకం ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలని చెప్పారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం వికారాబాద్ మండల టిఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు గయాజ్ కు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.