సిద్ధిపేటలో గెలుపు మాదే..

Published: Monday April 26, 2021
టిఆర్ఎస్ తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
సిద్దిపేట, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : సిద్దిపేటలో టిఆర్ఎస్ తాటాకు చప్పుళ్ళకు బీజేపీ అభ్యర్థులు ఎవరు భయపడరని, ఎన్ని అడ్డంకులు సృష్టించిన పురపోరులో బిజెపి అభ్యర్థుల గెలుపు ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం 16, 31, 32, 33, 34, 43వ, వార్డుల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ సిద్దిపేటలో అభివృద్ధి బూటకం అని కొట్టిపారేశారు.ఓట్ల కోసం మంత్రి హరీష్ రావు టిఆర్ఎస్ నాయకులు పోలీసులను వాడుకుంటూ టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మెయిన్ రోడ్లలో కొంతమేర అభివృద్ధి జరిగింది తప్ప గల్లీలలో ఏమీ జరగలేదని విమర్శించారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగు పడాలంటే గల్లీలు అభివృద్ధి చెందాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చాయని ఆగమాగం రోడ్లు వేస్తూ నాసిరకం పనులు చేపడుతున్నారని అన్నారు. మున్సిపల్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని రోడ్లుకు నున్నటి మెరుగులు అద్దుతూ మెరిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పుట్ పాత్ లకు హరిత హారంలో పెట్టిన చెట్లకు రంగులు వేసి ఇదే అభివృద్ది అని మాయమాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని చూడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సిద్దిపేటను మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని వాపోయారు. సిద్దిపేట పట్టణ ప్రజల జీవన స్థితి గతులు  మెరుగుపడాలంటే ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని రఘునందన్ రావు ప్రజలను కోరారు. సిద్దిపేటలో అభివృద్ధి పేరిట కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు.బిజెపిని గెలిపిస్తే జరిగిన అవినీతి పై విజిలెన్స్ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ప్రచార కార్యక్రమంలో అభ్యర్థులు బొల్లవేని యాదగిరి, భాష శ్రీకాంత్, నందిని సునీల్, పైసా సుగుణ రామకృష్ణ, పుల్లయ్య గారి ఇంద్రాణి వెంకట్, కృష్ణవేణి మీడియా సెల్ జిల్లా కన్వీనర్ గోనె మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.