అత్యవసర మెడిసిన్ డెలివరీ డ్రోన్

Published: Wednesday March 23, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 22 మార్చి ప్రజాపాలన : అత్యవసర సమయాల్లో మందులను దూరప్రాంతాలకు చేర్చేందుకు మెడిసిన్ డెలివరీ డ్రోన్ లు ఎంతగానో దోహదపడతాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. మంగళవారం వికారాబాద్ నూతన ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో ఎయిర్ సర్వ్ కంపెనీ రూపొందించిన మెడిసిన్ డెలివరీ డ్రోన్ ను జిల్లా కలెక్టర్ ట్రయల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెడిసిన్ డెలివరీ డ్రోన్ల ద్వారా అత్యవసరంగా కావలసిన మందులు, రక్తము, పాము కాటుకు సంబంధించిన మెడిసిన్, వ్యాక్సిన్ ను అతి తక్కువ సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేర్చడంతో పాటు అవసరమైన ప్రాంతాలకు కూడా చేర్చేందుకు డ్రోన్లు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ అన్నారు. ఆధునికంగా విటిఓఎల్ (వర్టికల్ టేకఫ్ అండ్ ల్యాండింగ్) టెక్నాలజీ ద్వారా రూపొందించబడుతున్న డ్రోన్లు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో అవసరం ఉన్న ప్రాంతానికి మందులను చేరవేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం, డాక్టర్ అరవింద్, టెక్నికల్ నోడల్ అధికారి మహమూద్, ఎయిర్ సర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.