చినుకు పడితే పట్నం వీధులు చిత్తడి చిత్తడే

Published: Tuesday August 31, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30, ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల కురుస్తున్న వర్షానికి ఇబ్రహీంపట్నం రోడ్లు బురద మయంగా మారాయి. కాలు తీసి అడుగు వేయలేని దుస్థితి తలెత్తింది. ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు పడాలంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని బృందావన్ కాలనీ, గోకుల్ నగర్, వినాయక నగర్, అంబేద్కర్ నగర్, వెంకట రమణ కాలని, పద్మశాలి కాలనీ, శిరిడి సాయి నగర్, శాలివాహన నగర్ పలు వార్డులో రోడ్ల పరిస్థితి ఇదే విధంగా కనిపిస్తోంది. ఒకపక్క మిషన్ భగీరథ పైపుల నిర్మాణం కోసం రోడ్లను తవ్వి వదిలేసిన దృశ్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. కాల్వలలో  అక్కడక్కడ కొంత చెత్త చెదారం పేరుకుపోయి నీళ్ళు సాఫీగా ముందుకు సాగని పరిస్థితి కూడా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ల నిర్మాణం కోసం తీసిన గోతులను వెంటనే పూర్తి చేసి రోడ్లను పునరుద్ధరించాలని సంబంధిత పట్టణ పాలకవర్గం, అధికారులను పట్టణ ప్రజలు కోరుతున్నారు.