వినికిడి సమస్యలపై నిర్లక్ష్యం వద్దు -ఆడియాలజీ వైద్యుల విజ్ఞప్తి హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతి

Published: Friday March 03, 2023

వినికిడి సమస్యలపై నిర్లక్ష్యం సరికాదని ప్రముఖ ఆడియాలజిస్ట్ లు శివ ప్రసాద్, నాగేందర్ విజ్ఞప్తి చేశారు.  ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని వినికిడి సమస్యలు, పరిష్కార మార్గాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ శిశువు జన్మించిన తొలినాళ్లలోనే వినికిడి పరీక్షలు నిర్వహించడం ద్వారా సమస్యను నివారించవచ్చునని అన్నారు. ఈ అంశంపై అవగాహన లేకపోవడంతో ఎంతో మంది వైకల్యంతో బాధపడుతున్నారని చెప్పారు. దేశంలో ప్రతి ఏడాది సుమారు లక్ష మంది వినికిడి సమస్యతో జన్మిస్తున్నారని తెలిపారు. వినే సామర్థ్యం లేకపోవడంతో పదాలను పలికే సామర్ధ్యాన్ని కోల్పోతున్నారని, తద్వారా ఇతరులతో కలవలేక పోతున్నారని అన్నారు. మూడేళ్ల లోపు చిన్నారులకు వినికిడి లోపాలను గుర్తిస్తే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఆరేళ్ల లోపు వినికిడి సమస్యలను గుర్తిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించవచ్చునని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడియాలజిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ అసోసియేషన్ (ఎంఎస్ఎల్ పీఏ) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాల తోపాటు  రెండు రోజులపాటు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో ఉచిత స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.