ప్రజా సమస్యల పోరాటమే వైఎస్ఆర్ టిపి లక్ష్యం

Published: Monday February 07, 2022
వైఎస్ఆర్ టిపి సీనియర్ నాయకుడు గట్టు రాంచందర్ రావు
వికారాబాద్ బ్యూరో 06 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ టిపి పార్టీ కృషి చేస్తుందని పార్టీ సీనియర్ నాయకుడు గట్టు రామచందర్ రావు అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లిలో సూర్య ప్రకాష్ టౌన్షిప్ లో వైఎస్సార్ టిపి అధ్యక్షుడు తమ్మలి రాజు జిల్లా అధికార ప్రతినిధి కోళ్ల యాదయ్యల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ తెలుగింటి ఆడపడుచు షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల ముందుకు రానున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు షర్మిలను అక్కున చేర్చుకుని ఆదరించాలని కోరారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. 137 రోగాల చికిత్స నిమిత్తం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిన ఘనత వైయస్ రాజశేఖర్రెడ్డి దక్కుతుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. వైఎస్ఆర్ టిపి వ్యవస్థాపకురాలు షర్మిల త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారని చెప్పారు. పాలనా పగ్గాలు చేపట్టే ఆత్రుత లేదని ముందుగా మండల స్థాయి నుండి పార్టీని పటిష్టత పరిచే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. ప్రతి మండల పరిధి నుండి కనీసం 225 మంది ని పార్టీ కార్యకర్తలు గా గుర్తించాలని హితవు పలికారు. వైఎస్ఆర్ టిపి జిల్లా అధ్యక్షుడు తమ్మలి రాజు మాట్లాడుతూ పార్టీని పటిష్టపరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి మండలాల వారీగా కమిటీలను వేసి పార్టీ నియమ నిబంధనలు ప్రతి కార్యకర్త కు అవగాహన కల్పించి ముందుకు వెళ్తామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల ఆధ్వర్యంలో పార్టీని పటిష్టం చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలైన బిజెపి కాంగ్రెస్ ల వైపు ప్రజల దృష్టి సన్నగిల్లిందని విమర్శించారు. టిఆర్ఎస్ బిజెపి బయట ప్రపంచంలో పరస్పరం విమర్శించుకొన్నా అంతరార్థ అవగాహన మాత్రం దండిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రోజీ లీనా రజిని నరేందర్ తదితర వైఎస్ఆర్ టిపి కార్యకర్తలు పాల్గొన్నారు.