మంచి అలవాట్లతో మెరుగైన సమాజం నిర్మించాలి

Published: Monday January 17, 2022

పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షుడు పల్లా కొండలరావు

బోనకల్, జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి: పిల్లలకు మంచి అలవాట్లు నేర్పడం ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించొచ్చని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు తెలిపారు. శనివారం చొప్పకట్లపాలెం యూత్ ఆధ్వర్యంలో గ్రామంలో జరిగిన సంక్రాంతి క్రీడల బహుమతి ప్రధాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చొప్పకట్లపాలెం యూత్ కమిటీ ఆధ్వర్యంలో 13,14,15 తేదీలలో కబడ్డీ, వాలీబాల్, క్విజ్, ముగ్గులు, పాటలు, డాన్స్ వంటి క్రీడా, సాంస్కృతిక, వైజ్ఞానిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. పోటీలలో విజేతలకు పల్లా కొండలరావు, బోయన విజయ, ఆవుల ఉపేందర్ లు బహుమతులు అందజేశారు. సాతెల్లి నవీన్ అద్యక్షతన జరిగిన సభలో పల్లా కొండలరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో ఉన్న మంచిని కాపాడుకోవాలని, కార్పొరేట్, వినిమయ పోకడలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖమ్మం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బోయన విజయ మాట్లాడుతూ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా యువత ఐక్యంగా రాజకీయాలకతీతంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని వారిని అభినందించారు. ముగ్గుల పోటీల్లో అత్యధికంగా మహిళలు పాల్గొనడమే గాక స్పూర్తి దాయకమైన రంగవల్లులను తీర్చిదిద్దడం సంతోషంగా ఉందనన్నారు. యూత్ నాయకుడు ఆవుల ఉపేందర్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో, ఆటలలో మహిళల పాత్ర పెరగాలని కోరారు. తమ కార్యకలాపాలను విజయవంతం చేసేందుకు ఆర్థిక, హార్దిక సహకారం అందించిన వారికి యూత్ కమిటీ తరపున సాతెల్లి నవీన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సగాని గోపి, బోయినపల్లి నవీన్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.