విద్యార్థుల ఆరోగ్యం పై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Friday September 09, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 8 (ప్రజాపాలన, ప్రతినిధి) : విద్యార్థుల ఆరోగ్యం పై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురుకుల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. గత 15 రోజులుగా వివిధ గురుకులాల్లో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కేజీబీవీ, సాంఘిక సంక్షేమ బాలుర, గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలను గురువారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ రకాల పరిశీలించి పరిసరాలను  పరిశీలించారు. విద్య భోజనానికి సంబంధించిన విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ విద్యార్థులకు కావలసిన మందులు అందజేయాలన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు నేపథ్యంలో విద్యార్థుల్లో జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని, వీటివల్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వచ్ఛ  గురుకుల కార్యక్రమం కొనసాగుతున్నందున ఎప్పటికప్పుడు గురుకుల పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం గిరిజన బాలికల కళాశాలలో స్వచ్ఛ గురుకులం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.