ఘనంగా ముగిసిన శ్రీ మత్స్య గిరింద్ర స్వామి జాతర శంకరపట్నం ఫిబ్రవరి 6 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Tuesday February 07, 2023
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం  కొత్తగట్టులో గత నెల 28న అధ్యాయనోత్సవాలతో ప్రారంభమై ఈ నెల 01న సోమవారం స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగగా ఈ వేడుకకు జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల విజయ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆదివారం ఫిబ్రవరి 5, మాఘశుద్ద పౌర్ణమి రోజున స్వామివారి సుప్రభాతం, నిత్యారాధన, బాల భోగం, తీర్థ గోష్టి సేవలతో  ప్రారంభమైన స్వయంభూ మత్స్యగిరింద్ర స్వామి జాతర రెండు రోజులపాటు కనులపండుగగా జనసముద్రమై సాగింది. ఈ జాతరకు సుమారుగా లక్షన్నరమంది భక్తులు హాజరై, కోనేటి స్నానాలను ఆచరించి శ్రీ మత్స్య గిరింద్ర స్వామి వారికి  మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు హాజరైన భక్తులకు స్వామివారి సన్నిధానంలో అన్నదానము చేశారు.ఆదివారం ప్రారంభమైన జాతరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, మానకొండూరు నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, హుజురాబాద్ ఏసిపి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపగా ఆలయ అర్చకులు శేషం మురళీధరచార్యులు వారికి  తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి ఆశీర్వచనం తెలిపారు . అనంతరం ఆలయ చైర్మన్ సాగి మలహల్ రావు వారికి శాలువా కప్పి సన్మానం చేశారు. జాతర ఆధ్యంతం జనసముద్రమై అలరారింది. జాతరలో
జన నియంత్రణకు హుజురాబాద్ సిఐ బి. జనార్ధన్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై డి. చంద్రశేఖర్ 5గురు ఎస్సైలతో పాటు 150 మంది పోలీసులతో పటిష్ట భద్రతను నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిసి కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. జాతరలో కేశవపట్నం గోవిందపతి శ్రీవారి సేవా సమితి సమితి బృందం, హుజురాబాద్ వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు భక్తులకు వివిధ సేవలను అందించారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారికి సాయమారాధన, నిత్య హావనం, బలిహరణం వంటి సేవలు జరిగాయి. అనంతరo గరుడ వాహనము పై స్వామివారిని ఆలయ ఆవరణములోని వీధులలో ఊరేగింపు జరిగింది. సోమవారం స్వామివారికి సుప్రభాతం నిత్యారాదన, బాలభోగం,  శేష హోమం, మధ్యాహ్నం పుష్కరిణిలో చక్రస్నానం, ఏకాంత సేవ వంటి సేవలు జరిగాయి. స్వామివారి రెండు రోజుల జాతర అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. అధ్యయనోత్సవాలతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలో నిత్య పూజలు, హోమాలలో గ్రామ సర్పంచ్ ముకిరాల కిషన్ రావు, మండల పరిషత్ అధ్యక్షురాలు ఉమ్మంతల సరోజన, ఆలయ చైర్మన్ సాగి మలహల్ రావు, ధర్మకర్తలు ఉమ్మెంతల సుగుణాకర్ రెడ్డి, మాడ తిరుపతిరెడ్డి, కోరెం తిరుపతిరెడ్డి, తీగల సంపత్, రామగిరి సునీత, కాసు తిరుపతి దంపతులు పాల్గొన్నారు. జాతరలో భక్తులకు వివిధ సేవలందించిన  వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులను ఆలయ చైర్మన్, ధర్మకర్తలు కండువాలు కప్పి సత్కరించారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టాలైన స్వామివారి కళ్యాణం,  జాతర ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా ప్రశాంతంగా జరగడంతో పాటు సోమవారం సాయంత్రం  నాఖబలి, పుష్పయాగంతో శ్రీ మత్స్య గిరింద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసినట్లుగా ఆలయ పూజారి శేషం మురళీధరచార్యులు, మాధవాచార్యులు, ఆలయ ఈవో   కే.సుధాకర్ పేర్కొన్నారు.