ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

Published: Monday August 23, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 22 ప్రజాపాలన ప్రతినిధి : భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిరూపంగా భావించే రక్షాబంధన్ వేడుకలను ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆడపడుచులు పుట్టింటికి చేరుకుని తమ సోదరులకు ప్రేమతో, కలకాలం సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ రాఖీలు కట్టి దీవించారు. దీనికి ప్రతిగా సోదరులు నూతన వస్త్రాలు, బహుమతులను కానుకగా అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులంతా సమీప ఆలయాలకు తరలివెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు రాఖీ పండుగను భారతీయ సంప్రదాయానికి నిలువుటద్దంగా భావించి ఘనంగా జరుపుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు  రాఖీలు కట్టి మిఠాయిలను పంచి పెట్టారు. చిన్నా, పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ రాఖీ పౌర్ణమి వేడుకలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి ముంజేతులకు వివిధ రంగుల్లో, ఆకర్షణీయమైన రూపాల్లో కళకళలాడుతూ రాఖీలు దర్శనమిచ్చాయి.