రోగ నిర్ధారణకు రక్తనమూనాలను సేకరించాలి : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Wednesday October 06, 2021
వికారాబాద్ బ్యూరో 05 అక్టోబర్ 10 ప్రజాపాలన : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి రోగ నిర్ధారణ కోసం రక్త నమూనాల సేకరణ ప్రతిరోజు సకాలంలో జరగాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్య అధికారులను సూచించారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద నుండి వైద్య శాఖ ఆధ్వర్యంలో రక్త నమూనాల సేకరణ కొరకు ఏర్పాటు చేసిన రెండు వాహనాలను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిరోజు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి రక్త నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ కు  వాహనాల ద్వారా తరలించినట్లయితే, సేకరించిన నమూనాల పరీక్షలు నిర్వహించి అట్టి రిపోర్టులను PHC కి, అలాగే రోగి ఫోన్ కు పంపడం జరుగుతుంది. దీని వల్ల రోగ నిర్ధారణ జరిగి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుపడుతుందన్నారు. రక్త నమోనాల సేకరణ ప్రతిరోజు వాహనముల ద్వారా జరగాలని ఆదేశించారు. అనంతరం D-హబ్ లో నిర్వహిస్తున్న పరీక్షలను, పని తీరును సంబంధిత వైద్య అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.తుకారాం, Dy. DMHO జీవరాజ్, డా.బిజినిల్, డా.అరవింద్, డా.పవిత్ర ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఓటరుగా నమోదు చేసుకోవాలి :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో "ఓటర్ హెల్ప్ లైన్ యాప్" అను గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరుకు సంబంధించిన అన్ని సేవలు, సదుపాయాలను ఓటర్లు తమ మొబైల్ లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని పొందాలన్నారు. నూతనంగా ఓటరుగా నమోదు కోసం అసెంబ్లీ నియోజకవర్గం మారినప్పుడు ఫారం - 6 ను, చిరునామా మారితే ఫారం -8A, సవరణలు ఉంటే ఫారం -8, జాబితాలో తొలగింపు కొసం ఫారం -7 ప్రకారం యాప్ లో అప్ డేట్, ధ్రువీకరణ చేసుకోవలాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని ఈ సందర్బంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, స్వీప్ నోడల్ ఆఫీసర్ కోటాజి, కలెక్టరేట్ ఎలక్షన్ తహసీల్దార్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.