మద్యం కారణంగా ఊరు వదులుతున్న కోడళ్ళు... !

Published: Thursday September 30, 2021
పులుసుమామిడి గ్రామ పర్యటనలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎదురైన వాస్తవ సంఘటన
వికారాబాద్ బ్యూరో 29 సెప్టెంబర్ ప్రజాపాలన : జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వికారాబాద్ మండల పరిధిలోని ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతున్నది. ఎక్సైజ్ అధికారులు కాసుల కక్కుర్తికి ఆశపడి పలు గ్రామాలను సందర్శించిన తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామానికి చెందిన ఇసాక్ పాష వాగు వరద ఉధృతిలో కొట్టుకొని మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించుటకు వెళ్ళారు. మంత్రి వచ్చిన విషయాన్ని గమనించిన పులుసు మామిడి గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఫిర్యాదు చేశారు. అమ్మా మీకు దండం పెడతాం మీ కాళ్లు మొక్కుతాం పులుసుమామిడి గ్రామంలో బెల్టుషాపులను మద్యం దుకాణాలను బంద్ చేయించాలని కోరారు. మా గ్రామంలోని మగవారు మద్యం సేవించి మద్యం మత్తులో ప్రతిరోజు తాగి ఇండ్లను గుల్లచేయడమే కాకుండా ఇల్లాల్లను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారని మొరపెట్టుకున్నారు. తాగుబోతుల కారణంగా బాధలు పడలేక మా కోడండ్లు పులుసుమామిడి ఊరు వదిలి వారి అమ్మగారి ఇళ్లకు వెళ్తున్నారని అత్తలు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నలుగురు కోడండ్లు పులుసుమామిడి గ్రామం వదిలి వెళ్ళారని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇంకెందరు కోడండ్లు ఇండ్లు వదులుతారోనని గ్రామ అత్తలు మహిళలు విచారం వ్యక్తం చేశారు. పచ్చని కాపురాల్లో నిప్పులు కురిపిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులకు పలు రకాల రోగాలు వచ్చి నాశనం అవుతారని శపించారు. వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి, సిద్దులూరు మదన్ పల్లి ఎర్రవల్లి తదితర గ్రామాలలో విచ్చలవిడిగా బెల్టుషాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా కాసులు కురిపిస్తున్నాయని ప్రజలు తెలిపారు.