ఎమ్మెల్సీ తాతా మధు మండల ప్రజల సమస్యలు ఎప్పుడు తీరుస్తారు : బిజెపి యువనేత బీపీ నాయక్

Published: Thursday May 19, 2022
బోనకల్, మే 18 ప్రజా పాలన ప్రతినిధి: స్థానిక మండల కేంద్రంలో మొట్టమొదటి సారిగా మండల పరిషత్ సమావేశాలకు విచ్చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ తాతా మధు కి బీజేపీ యువనేత బీపీ నాయక్ ఆహ్వానం పలుకుతూ వివిధ ప్రశ్నలను సంధించారు. ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, నాయకులు వచ్చే ఎలక్షన్స్ లో సీట్ల వెంట పరిగెడుతూ పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. ఇదే సందర్భంలో అతనికి కొన్ని ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను రాశారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మా ప్రాంతానికి మొదటిసారిగా వచ్చారు.
మీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మధిర నియోజకవర్గంలో బోనకల్ మండలంలో నెలకొల్పాలన్న ఐటిఐ మరియు డిగ్రీ కాలేజీలను ఎప్పుడు తీసుకువస్తున్నారని, పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలకు తయారవుతున్న చుట్టుపక్కల 18 గ్రామాల యువకులకు విద్యార్థులకు సాధన చేయడానికి సరైన మైదానం కానీ వ్యాయామం స్థలం కాని కేటాయించలేదని,
అప్పులు తెచ్చి, వడ్డీలు కట్టుకుంటూ ఆర్ ఓ బి బ్రిడ్జి కింద ఇన్నాళ్లు జీవనం సాగించిన చిరు వ్యాపారుల బతుకులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి. వారి బతుకులు రోడ్డు మీదకు వచ్చాయి. వారికి సరైన ప్రత్యామ్నాయం ఈ నిమిషం వరకైన చూపించలేదని, వాళ్ల కోసం ఏర్పాటు చేయడానికి జనతా బజార్, జనతా మార్కెట్ లకు స్థలాల కేటాయించ లేదని,గత ఏడు సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు అందక, కొత్త రేషన్ కార్డులు రాక కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్న కూడా పంచాయతీ సిబ్బందికి ఇప్పటికీ రాని ఉద్యోగం వేతనాలు ఎన్నో నెలలుగా పెండింగ్లో ఉన్నాయని,సకాలంలో వారి వేతనాలు ఇచ్చే సౌకర్యం కల్పించాలని,కెసిఆర్ కట్టించే డబుల్ బెడ్రూం ఇల్లు కనీసం చూద్దాం అన్న కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదని, మండల ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అవసరం లేదని అనుకుంటున్నారా అని వారు అన్నారు. మంచి నీరు అందని గ్రామాలు, సిమెంట్ రోడ్లు లేని గ్రామాలు మండల ప్రాంతంలో చాలా ఉన్నాయని,
మూడెకరాల భూమి అడగడం లేదు, దళిత బంధు అడగడం లేదు, నిరుద్యోగ భృతి అడగడం లేదు. ఇచ్చిన హామీలు కేవలం ప్రశ్నలుగానే మిగిలిపోతున్నవని, ఇన్ని సమస్యలు ఉన్నా మండల ప్రజలకు ఎందుకు అమలు కావడం లేదని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.