వికారాబాద్ జిల్లాకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయిండి

Published: Thursday February 02, 2023
* నిధులు కేటాయించి న్యాయం చేయండి
* చేతకాకపోతే దిగిపోండి
* జిల్లా టీ.జెఏ.సి చైర్మన్ ముకుంద నాగేశ్వర్
వికారాబాద్ బ్యూరో 1 ఫిబ్రవరి ప్రజాపాలన :
 తొమ్మిది ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్రంలో పరిగి నియోజకవర్గానికి మాటలు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కు అభివృద్ధి మూటలు అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని జిల్లా టీ.జెఏ.సి చైర్మన్ ముకుంద నాగేశ్వర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూళఈ బడ్జెట్ లో నైనా ఈ ప్రాంత ప్రజలకు అత్యధిక నిధులు కేటాయించి న్యాయం చేయాలని  డిమాండ్ చేశారు.
తొమ్మిది ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో పూర్వ రంగారెడ్డి జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి, విధ్వంసానికి గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోవు బడ్జెట్ లో నైనా పూర్వ రంగారెడ్డి జిల్లాలోని మూడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పూర్వ రంగారెడ్డి జిల్లాలో పనులకు, పరిగి, వికారాబాద్ లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల భవనాలకు, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల భవనాలకు నిధులు కేటాయించాలని కోరారు. నూతన వికారాబాద్ జిల్లాలో గ్రామీణ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, మహిళా గురుకుల బీసీ, ఎస్టీ డిగ్రీ కళాశాలలు మంజూరుతో పాటు రాబోవు  సంవత్సరం నుండి ప్రారంభించుటకు నిధులు కేటాయించాలన్నారు. పరిగిని నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడంతో పాటు నూతన మండలాలకు మండల కార్యాలయాల భవనాలకు నిధులు మంజూరు చేయాలన్నారు. వికారాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రాంత 2014,2018  ఎన్నికల హామీలైనటువంటి తాండూరులో స్టోన్ క్రషింగ్ పరిశ్రమ, కందిబోర్డు, పరిగిలో పాలిటెక్నిక్ కళాశాల, పరిగిలో రైతు బజార్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. యాదాద్రి అభివృద్ధి తరహాలో అనంతగిరి, దామగుండం,పాంబండ, రాకంచెర్ల దేవాలయాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలన్నారు. లక్నాపూర్, దౌల్తాబాద్, సాలార్ నగర్, బొమ్రాస్పేట్ చెరువులను లక్కవరం చెరువు తరహాలో అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్టేడియం నిర్మాణానికి నిధులు అత్యంత ఆవశ్యకమని వివరించారు. తొమ్మిది ఏళ్లలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక, వివక్షకు గురైన ఈ ప్రాంతానికి ఈ బడ్జెట్ లో నైనా అత్యధిక నిధులు కేటాయించి న్యాయం చేయండి లేకపోతే రాబోవు ఎన్నికలలో  ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.